Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ..

Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
Andhra Weather Report

Updated on: Jul 19, 2026 | 6:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విపత్తుల నిర్వహణ విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, మన్యం, పోలవరం ప్రాంతం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు తడిగా మారే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో పొలాల్లో పనులు నిలిపివేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని ఏపీఎస్‌డీఎంఏ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us