ఏపీ ఎన్నికలపై SEC కీలక ఆదేశాలు.. ఖర్చుల లెక్కలు చూపకపోతే మూడేళ్ల అనర్హత!

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఫస్ట్‌ ఫేజ్‌ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ జరగనుంది. 23 మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసింది. 46వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. అటు.. ZPTC, MPTC ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని SEC ఆదేశించింది.

ఏపీ ఎన్నికలపై SEC కీలక ఆదేశాలు.. ఖర్చుల లెక్కలు చూపకపోతే మూడేళ్ల అనర్హత!
Ap Panchayat Elections

Updated on: Nov 25, 2026 | 8:15 AM

ఏపీలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3వేల 191 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3 వేల 949 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 758 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు.. 23 మున్సిపాలిటీల్లో మలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే.. గ్రామ పంచాయతీ, 23 మున్సిపాలిటీల ఎన్నికలపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ దృష్టి సారించింది. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై SEC అనిల్ చంద్ర పునేఠా కీలక సూచనలు చేశారు. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల్లోపు కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని చెప్పారు. ఇక.. గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో గరిష్టంగా 650 మంది ఓటర్లకు మించకుండా చూడాలన్నారు. ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను కనీసం 60 రోజుల పాటు భద్రపరచాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో మొబైల్ పోలీసు బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు SEC అనిల్ చంద్ర పునేఠా.

46,080మందితో భారీ పోలీసు బందోబస్తు

ఎన్నికల భద్రతపై ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పూర్తిస్థాయి ప్రణాళికను ప్రకటించారు. తొలి విడత పంచాయతీ, మలివిడత మున్సిపల్ ఎన్నికలకు పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 26 జిల్లాల్లోని 201 మండలాల్లో జరగనున్న ఎన్నికల కోసం 46,080 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు చెప్పారు. సీటీవీలు, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాలతో ఎన్నికలను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పటిష్ట భద్రతతో పాటు.. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా.. అనుమానిత వ్యక్తులపై ఇప్పటికే ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

45 రోజుల్లోగా వ్యయ వివరాల సమర్పణకు ఆదేశాలు

మరోవైపు.. ZPTC, MPTC ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా తమ ఎన్నికల వ్యయాన్ని సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గెలిచిన అభ్యర్థులైనా ఓడిన అభ్యర్థులైనా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలక్షన్‌ ఖర్చును సమర్పించాలని SEC అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల ఖర్చుల వివరాలను వచ్చే నెల 21లోగా స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. లెక్కలు చూపకపోతే పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 19-B ప్రకారం మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుందని చెప్పారు. అలాగే.. లెక్కలు సబ్మిట్‌ చేయకుంటే గెలిచినవారు కూడా పదవి కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లకు SEC అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా.. ఏపీ రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ, మలివిడత మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అటు.. ZPTC, MPTC అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాల సమర్పణపైనా ఎస్ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us