
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షడు మాధవ్ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా విభేదాలపై బాబు, పవన్, మాధవ్ స్పష్టత ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లాగా కలిసి పనిచేయాలని కేడర్‌కు కూటమి నేతలు దిశానిర్దేశం చేశారు. చెప్పాం, చేస్తున్నాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పదేళ్లపాటు విధ్వంసపు పాలన చేశారని,
ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసం ప్రారంభించిందని అన్నారు. పవన్ కల్యాణ్‌ను నగర బహిష్కరణ చేశారని, తనను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారన్నారు. రాజమండ్రి నుంచే కూటమికి బీజం పడిందని, గతం గుర్తుచేసుకుంటే.. భవిష్యత్ ప్రణాళిక ఈజీ అన్నారు. 2024ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామని, అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా 97శాతం పంటల సాగు జరిగిందని, రిజర్వాయర్లలో నీళ్లు నింపి ఇబ్బంది లేకుండా చూశామని తెలిపారు. కూటమిగా కలిసి పనిచేయడంతోనే సమస్యలు అధిగమించామన్నారు. ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ముంచుకొస్తోందని, రెండు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
అర్నబ్ తుఫాన్‌పై పవన్, తాను నిరంతరం మానిటర్ చేస్తున్నామన్న చంద్రబాబు..తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒకవైపు కరువు, మరోవైపు తుఫాన్‌ను ఎదుర్కొంటున్నామని, ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయన్నారు. ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఐక్యంగా ముందుకు వెళ్లడంతోనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
అటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2024లో సాధ్యమైనంత సులువుగా ఇప్పుడు సీట్ల సర్దుబాటు లేదని, మేయర్, చైర్మన్లు, పరిషత్తుల్లో చూస్తే సీట్ల సంఖ్య వేలల్లో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పోటీదారుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండడంతో కష్టంగా మారిందని, అయినా కూడా అంతా ఒక్కతాటిపైకి వచ్చామన్నారు. నాయకులుగా తాము ఏకతాటిపైకి వచ్చామన్న పవన్.. అదేస్థాయిలో కింద కేడర్ కూడా ఉండాలని సూచించారు. కూటమి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కి సూచించిన పవన్.. రాష్ట్రస్థాయిలో ఉన్నట్లు గ్రామస్థాయిలోనూ ఐక్యత ఉండాలన్నారు -కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ చాలెంజింగ్‌గా సాగిందన్న పవన్.. కేటాయింపుల్లో ఆలస్యం వల్ల ఎవరికి వాళ్లు నామినేషన్ వేసేశారన్నారు. రాష్ట్రస్థాయిలో తాము బీఫారమ్ ఇచ్చిన వాళ్లే అభ్యర్థులు అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. మిగతా వాళ్లు పోటీకి రాకుండా పార్టీ నిలబెట్టిన వాళ్లకు సపోర్ట్ చేయాని, నష్టపోయారని భావించిన వాళ్లకు భవిష్యత్‌లో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.