
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సన్నరకం ధాన్యం పండించిన రైతుల ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. కోత యంత్రం నుంచి ధాన్యం బయటకు రాగానే వ్యాపారులు అక్కడికక్కడే కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ఆకర్షణీయమైన ధరలు లభిస్తుండగా, క్వింటాల్ ధాన్యానికి రూ.3500 వరకు దక్కుతోంది. ఇది ప్రభుత్వ మద్దతు ధర కంటే ఏకంగా 31.5% అధిక ధర. అంతేకాదు, గత ఏడాది ఖరీఫ్, రబీలో పండించిన పాత ధాన్యం అయితే మరింత డిమాండ్ పలుకుతోంది. పాత ధాన్యం క్వింటాల్‌కు రూ.4900 వరకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. వరి సాగు చరిత్రలోనే ఇవి అత్యధిక ధరలుగా నిలుస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు బస్తాల్లో ధాన్యం నింపి, అక్కడికక్కడే నగదు చెల్లించి తీసుకెళ్తున్నారు. వారంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.400 వరకు ధర పెరిగింది. దశాబ్దాలుగా వరి పండిస్తున్నా ఇంత ధర ఎప్పుడూ చూడలేదని రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కోతలు నెల్లూరు జిల్లాలోనే మొదలయ్యాయి. కర్ణాటక నుంచి వచ్చిన వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో సన్నరకాల ధాన్యం సాగు తగ్గడమే ఈ అధిక డిమాండ్‌కు ప్రధాన కారణమని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి సాగు సాధారణ విస్తీర్ణం కంటే 12% తగ్గింది. ఖరీఫ్, రబీ కలిపి గత ఏడాది కంటే 50 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా సన్నరకాల ధాన్యం సాగు బాగా తక్కువగా ఉంది. వీటిని సాధారణంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తారు. ఈ ఏడాది కాల్వలకు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు నాట్లు వేయలేకపోయారు. రాయలసీమలోనూ వరి సాగు తగ్గింది. అయితే, నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 119% వరి సాగు పెరగ్గా, తిరుపతి జిల్లాలో 84% పెరిగింది. ఈ ప్రాంతాల్లో సన్నరకాల సాగు అధికంగా ఉంది. మరోవైపు, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొన్ని చోట్ల వరి కోతలు మొదలైనా, అక్కడ దొడ్డు రకాల ధాన్యం కావడం వల్ల వాటికి అంతగా డిమాండ్ ఉండటం లేదు.
ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ వరి సాగు తగ్గింది. రబీలోనూ ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనాలు వెలువడటం సన్నరకాల ధాన్యానికి డిమాండ్ పెరగడానికి మరింత కారణంగా మారింది. కోతలు మొదలైన నెల్లూరు జిల్లాలో కొందరు రైతులు ధర ఇంకా పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీలో పండించిన సన్నరకం ధాన్యాన్ని అధిక శాతం రైతులు అప్పుడే అమ్ముకున్నారు. అక్కడక్కడ కొందరి వద్దనే నిల్వలు ఉన్నాయి. వాటికి ఇప్పుడు అధిక ధర పలుకుతోంది. అల్లూరు ప్రాంతంలో పాత ధాన్యం పుట్టి రూ.42,000కు అడుగుతున్నా, ఇంకా ఎక్కువ ధర వస్తే అమ్మే ఆలోచనలో కొందరు రైతులు ఉన్నారు. మరోవైపు, రైతులకు పెట్టుబడి వ్యయాలు పెరిగాయి. యూరియా, డీఏపీ పై నియంత్రణ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రైతులు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వేశారు. వీటి ధరలు పెరిగాయి. ఇతర ఖర్చులు కూడా కలిపితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎకరానికి రూ.5,000 పెట్టుబడి పెరిగింది. సగటున ఎకరానికి రూ.41,000 వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ, ధాన్యం ధరల పెరుగుదల వల్ల రైతులకు ఈ ఏడాది మంచి లాభాలు వస్తున్నాయి.