Andhra Pradesh: ఏపీలో కోరలు చాస్తోన్న డయేరియా.. బీ అలెర్ట్..

ఏపీలో డయేరియా కలకలం రేపుతోంది. ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభించగా.. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. తాజాగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పాకింది. ప్రధానంగా.. కాకినాడ జిల్లాలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతుండడంతో వైద్యశాఖ అలెర్ట్‌ అయింది. కాకినాడ, రాజమండ్రి జీజీహెచ్‌లో స్పెషల్‌ వార్డులు ఏర్పాటు చేసి.. ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు వైద్యులు.

Andhra Pradesh: ఏపీలో కోరలు చాస్తోన్న డయేరియా.. బీ అలెర్ట్..
Diarrhoea Cases
Follow us

|

Updated on: Jul 04, 2024 | 8:47 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాంతలు, విరేచనాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో రోగులు కాకినాడ జీజీహెచ్‌కు క్యూ కడుతున్నారు. ప్రధానంగా… కాకినాడ, రాజమండ్రి జీజీహెచ్‌లో డయేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం 24 కేసులు ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నపిల్లలు, మిగతావారు పెద్దవాళ్లు ఉన్నారు. ఎనిమిది మంది ICUలో చికిత్స పొందుతున్నారు.

ఇక.. ఇప్పటివరకు కాకినాడ జిల్లాలో కొమ్మనాపల్లి, బెండపూడి, వేట్లపాలెంలో 230కి పైగా డయేరియా కేసు రికార్డ్‌ కాగా.. ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మొదట తుని నియోజకవర్గంలోని బెండపూడి, ఉప్పాడ యూ.కొత్తపల్లిలో గ్రామాల్లో 70 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే.. ఒక్క జీజీహెచ్‌ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రిల్లోనూ డయేరియాతో చికిత్స పొందుతున్నారు పలువురు బాధితులు.

ఇదిలావుంటే… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా విజృంభణతో వైద్యఆరోగ్య శాఖ అలెర్ట్‌ అయింది. డయేరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుమారి తెలిపారు. వాతావరణ మార్పులతోనూ డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అయితే.. డయేరియా వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత విషయంలో అప్రతమత్తంగా ఉండాలని సూచించారు కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుమారి. కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమమన్నారు.

మొత్తంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా కేసులు కలకలం రేపతున్నాయి. అయితే.. కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఎవరికి.. ఎలాంటి ప్రాణాపాయం లేకండా ట్రీట్‌మెంట్‌ తర్వాత క్షేమంగా డిశ్చార్జ్‌ అవుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..