
డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆయభ హస్తం పథకం కింద మహిళలు పొదుపు చేసిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అభయహస్తం పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళలు 12 ఏళ్ల పాటు పింఛన్ కోసం డబ్బులు పొదుపు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది మహిళలు రూ.1194 కోట్లు పొదుపు చేశారు. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ.వెయ్యి కోట్లు కలిపితే మొత్తం రూ.2,194 కోట్ల అవ్వనుంది. అయితే గత ప్రభుత్వం ఈ సొమ్మును ఇతర అవసరాల కోసం మళ్లించింది. దీంతో తమ డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని డ్వాక్రా మహిళలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు డబ్బులను ఇచ్చేయాల్సిందిగా కోరారు.
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. తాజాగా ఆర్ధికశాఖ నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ రావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి అభయహస్తం పథకం డ్వాక్రా మహిళలకు అమలవుతోంది. ఈ పథకం కింద మహిళ ప్రతీ ఏటా రూ.365 ప్రీమియం చెల్లిస్తే.. ప్రభుత్వం అంతే సమానంగా రూ.365 కులుపుతుంది. మహిళకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.500 చొప్పున పింఛన్ అందిస్తారు. 2019 వరకు ఈ పథకం కొనసాగగా.. లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. గత 12 ఏళ్లుగా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు.
అయతే గత ప్రభుత్వం డబ్బులను ఇతర అవసరాలకు ఉపయోగించుకుంది. రెండేళ్ల పాటు ప్రీమియం చెల్లించకపోతే సభ్యత్వం రద్దు చేస్తామనే నిబంధన పెట్టారు. సభ్యత్వం రద్దైనవారికి అప్పటివరకు జమ చేసిన వాటిని చెల్లించలేదు. అలాగే మరణించిన సభ్యులకు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టింది. మహిళల నుంచి రిక్వెస్ట్‌లు రావడంతో ఈ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ నిర్ణయం వల్ల 22 లక్షల మందికి ఊరట కలగనుంది. అతి త్వరలోనే మహిళల అకౌంట్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి మహిళలు ధన్యవాదాలు చెబుతున్నారు. తాము చెల్లించిన డబ్బులు వెనక్కి వస్తుండటంతో సంతోషపడుతున్నారు. ఎంతోకాలంగా ఈ నగదు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల మందికి దీని వల్ల లబ్ది చేకూరనుంది.