
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకురానుంది. పాత కాలం నాటి కుటుంబ నియంత్రణ విధానానికి స్వస్తి పలికి కొత్త పాలసీ అమలు చేయనుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీ నుంచి కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.782 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనాభా వృద్ది రేటు తగ్గుతున్న క్రమంలో సంతానోత్పత్తిని పెంచేలా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించేందుకు సిద్దమైంది. ఆరోగ్యాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ పేరుతో కొత్త విధానం అమలు చేయనుంది. సంతానోత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
ఈ పాలసీలో ప్రతీ ఏటా 50 వేల జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ చేయించనున్నారు. నిరుపేద కుటుంబాల్లోని జంటలకు ఈ చికిత్స చేయించనున్నారు. సంతానం లేని పేదలకు ఇవి పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. బయట ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలంటే రూ.లక్షలు ఖర్చు అవుతాయి. పేదలకు ఇది పెద్ద భారంతో కూడుకున్న పని. దీంతో ప్రభుత్వమే ఉచితంగా చేయించనుంది. దీని వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జననాల రేటు అనేది తగ్గుతుంది. సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి తగ్గిపోయింది. ఇది 2.1 శాతంగా ఉండాల్సి ఉండగా.. పడిపోతుంది. దీంతో సంతానోత్పత్తి పెంచేందుకు పిల్లల సంపద పేరుతో ప్రతీ నెలా నాలుగో శనివారం గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఇక మహిళా ఉద్యోగులకు 12 నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. ఇక మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలు ఈ పాలసీలో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే వృద్దుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 నాటికి ఏపీలో వృద్దుల జనాభా 19 శాతానికి చేరుకుంటుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో వృద్దుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
చంద్రబాబు కీలక ప్రకటన
కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాపులేషన్ పాలసీ గురించి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలను ఎక్కువమంది కనాలని సూచించారు. వృద్దుల జనాభా పెరిగిపోతుందని, దీని వల్ల దేశానికి నష్టం జరుగుతుందన్నారు. పిల్లలను ఎక్కువమందిని కనేలా ప్రోత్సహించేందుకు నగదు సాయం అందిస్తామన్నారు.