
రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో చంద్రబాబు నాయుడు పర్యటించారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కవర్ కట్టిన పండ్ల నాణ్యత.. కవర్ లేని పండ్ల నాణ్యతను పరిశీలించారు. జిల్లాలో మంచి రేట్ వచ్చే వివిధ వెరైటీల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో భూగర్భ జలాల పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ పొందుపర్చిన ఈ పుస్తకాల వల్ల ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే తెలిసిపోతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఉచితంగా రైతులందరికీ పాసు పుస్తకాలు అందిస్తామని తెలిపారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూవివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవరైనా భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని భూమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించామన్నారు.