
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ప్రాజెక్ట్‌పై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు సాధారణ బ్రిడ్జిలు మాత్రమే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నా.. సీఎం చంద్రబాబు సూచనలతో ప్లాన్‌లో మార్పులు చేశారు. కొత్త ప్లాన్‌లో భాగంగా కృష్ణానదిపై మూడు లైన్లతో రెండుచోట్ల బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఐకానిక్ బ్రిడ్జిలు ఉండాలని చంద్రబాబు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ప్లాన్‌లో ఎన్‌హెచ్ఏఐ మార్పులకు శ్రీకారం చుట్టింది.
2018లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ సమయంలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెనల నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ 2024లో డిసెంబర్‌లో గతంలోని ప్రతిపాదనను పక్కన పెట్టి సాధారణ బ్రిడ్జిలు మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. రూ.38,450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్ కూడా రూపొందించగా.. ఇప్పుడు మళ్లీ మార్పులు చేశారు. చంద్రబాబు కోరిన విధంగా ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.30,491 కోట్లు తగ్గించారు. ఓఆర్ఆర్ బయటవైపు సర్వీస్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదనను పక్కన పెట్టారు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేలో కాజ వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 లైన్ల కనెక్ట్ రోడ్డు ప్రతిపాదన తొలగించారు. అలాగే మూడుచోట్ల సొరంగాలను 8 వరుసల రోడ్డుకు అనుకూలంగా తవ్వాలని ప్రతిపాదించగా.. దీనిని ఆరు వరుసల సొరంగాలకు పరిమితం చేశారు.