
ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్లు కోస్తాంధ్రను వణికించగా, మరో తుఫాన్ అక్వాన్ రెడీగా ఉంది. ఏపీకి తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడిందని.. ఇది ఇవాళ సాయంత్రం నాటికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా మారాక అక్వాన్గా నామకరణం చేయనున్నారు. తుఫాను ప్రభావంతో 18 నుంచి 20వ తేదా వరకు భారీ వర్షాలు కురవనున్నాయి.. తీరం దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 19 నుంచి 20 వరకు ఏపీ తీరంలో ప్రచండ గాలులు వీయనున్నాయి.. 145 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరికి ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక చేశారు. ఈనెల 20 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు చేశారు. గడిచిన 6 గంటల్లో 8 కిమీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైకు 720 కి.మీ., విశాఖపట్నంకు 820 కి.మీ.,గోపాల్పూర్ కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.. తుపానుగా మారిన తర్వాత.. ఆ తదుపరి 48 గంటల్లో అతి తీవ్ర తుపాన్ గా కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు.
అక్వాన్ (Akvan) అనేది బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానుకు ఇరాన్ సూచించిన పేరు.. పర్షియన్ భాషలో దీనికి రాక్షస శక్తి అని అర్థం.. పర్షియన్, ఇరానియన్ పురాణాల ప్రకారం ‘అక్వాన్’ అంటే ‘దుష్ట మనస్సు’ (Evil Mind), ‘దుష్ట ఆలోచన’ లేదా ‘రాక్షస శక్తి’గా పేర్కొంటారు..
అయితే.. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఐక్యరాజ్యసమితి ఆసియా-పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (UNESCAP) ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రకారం ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు నామకరణం చేస్తారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు నామకరణ విధానం సెప్టెంబర్ 2004లో ప్రారంభమైంది. ప్రస్తుత జాబితాను ఏప్రిల్ 2020లో ఆమోదించారు, ఇందులో 13 దేశాల సూచనలు ఉన్నాయి. ఈ దేశాలు బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ ఉన్నాయి. ప్రతి దేశం 13 పేర్లను అందించగా, ప్రస్తుత జాబితాలో మొత్తం 169 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లను దేశాల వారీగా, వరుసక్రమంలో, కాలమ్ వారీగా అమర్చి ఉపయోగిస్తారు. ఒకసారి ఒక పేరును ఒక తుఫానుకు ఉపయోగించిన తర్వాత, దానిని మళ్లీ పునరావృతం చేయరు.