
సాధారణంగా ఇంటి ముందు డ్రైనేజీ మరమ్మత్తు పనులు ఉన్నా.. కాలనీలో రోడ్లు సరిగా లేకపోయినా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా ప్రతినిధులను నిలదీయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తమ కాలనీలో కొత్త రోడ్లు వేసేందుకు ఉన్న రోడ్డును తవ్వి గుంతల మయం చేశారు. దీంతో రోడ్డు వేయలేదని వినూత్న నిరసనకు దిగాడు ఓ వ్యక్తి. గుంతల రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని నడిరోడ్డుపై గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ దర్గాపేట్ ఉప్పర్ బజార్‌లో పది రోజుల క్రితం పాత రోడ్డును తవ్వి కొత్త రోడ్డు వేయాలని అధికారులు పనులు ప్రారంభించారు. అయితే పది రోజుల క్రితం రోడ్డు నిర్మాణం పనులు కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేసి కొత్త రోడ్డు సంగతి మర్చిపోయారు. కాలనీలో రోడ్డు అద్వానంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సయ్యద్ నవాజ్ భాష అనే వ్యక్తి రోడ్డు కోసం వినూత్నంగా నిరసన చేపట్టాడు. గుంతలు తవ్విన రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని నడిరోడ్డుపై గుండు గీయించుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
పాత రోడ్డును తవ్వి పది రోజులైనా.. కొత్త రోడ్డు వేయలేదని, అధికారులకు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో సగంలో ఆగిపోయిన రోడ్డు వేయాలని నడిరోడ్డుపై గుండు గీయించుకున్నట్లు సయ్యద్ నవాజ్ భాష తెలిపారు. రోడ్డు అద్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆవేదనతోనే ఈ పనికి పూనుకున్నట్లు భాషా అంటున్నాడు. రోడ్డు కోసం రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని గుండు గీయించుకోవడం… నిరసన చూస్తుంటే వెరైటీగా ఉంది కదా..!
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..