
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరంలో కొలువైన శ్రీ గంగా భాగీరథీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలకు నిలయంగా విరాజిల్లుతోంది. సాధారణంగా శివలింగాలు గుండ్రంగా లేదా స్థూపాకారంలో ఉంటాయి. కానీ ఇక్కడి స్వయంభూ శివలింగం సహజసిద్ధంగా కప్ప ఆకారాన్ని పోలి ఉండటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తరతరాలుగా స్థానికులు దీనిని చిన్న కాశీ లేదా దక్షిణ కాశీగా కొలుస్తుంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని బొడ్డుపల్లి అని పిలిచేవారు. స్థలపురాణం ప్రకారం.. ఒక ఉప్పు వ్యాపారి వ్యాపార నిమిత్తం ఈ గ్రామానికి వచ్చి రాత్రి బస చేశాడు. పరమ శివభక్తుడైన ఆ వ్యాపారికి నిద్రపోయే ముందు పూజించేందుకు సమీపంలో ఎక్కడా శివాలయం కనిపించలేదు.
ఈ క్రమంలో నేలపై కొంత ఉప్పును పోసి, దానిపై తను వస్తువులను కొలవడానికి వాడే పాత్ర (మానిక)ను బోర్లించి, దానినే సాక్షాత్తు శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ కొలత పాత్ర అద్భుతంగా శివలింగ రూపంలోకి మారిపోయింది. అలా ‘మానిక’ రూపంలో వెలసిన ఈశ్వరుడు కావడంతో ఈ క్షేత్రానికి మణికేశ్వరం అనే పేరు స్థిరపడిందని భక్తుల విశ్వాసం. పూర్వం మాండూక మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని సేవించారని, అందుకే శివలింగం కప్ప ఆకారంలో దర్శనమిస్తుందని చెబుతారు.
కాశీ క్షేత్రానికి ఉండే అనేక విశిష్ట లక్షణాలు ఈ ఆలయ పరిసరాల్లోనూ కనిపిస్తాయి. కాశీలో గంగా నది ప్రవహించినట్లుగానే, ఇక్కడ ఆలయం పక్కనుంచే గుండ్లకమ్మ నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తోంది. ఆలయానికి ఎదురుగా శ్మశాన వాటిక ఉండటం, ప్రాంగణంలో ప్రాచీన శమీ వృక్షం కొలువై ఉండటం కాశీ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ఈ ప్రత్యేక పోలికల కారణంగానే మణికేశ్వరాన్ని తరతరాలుగా చిన్న కాశీగా పిలుచుకుంటున్నారు.
చారిత్రక ఆధారాలు, ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం ఈ దేవాలయాన్ని క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. తీర్థయాత్రలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ బస చేసిన చోళ రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, మణికేశ్వరంలోని మల్లేశ్వరస్వామి కొండపై క్రీస్తు పూర్వానికి చెందిన రాక్షస గూళ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది ఈ ప్రాంతం యొక్క అత్యంత ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ప్రాచీన క్షేత్రం అద్దంకి పట్టణానికి 15 కిలోమీటర్లు, ఒంగోలు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతీ ఏటా కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక విశేషాలను చూడాలనుకునే వారికి ఈ ఆలయం ఒక అద్భుతమైన దర్శనీయ స్థలం.