Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది.

Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
White House Declares End To War With Iran

Updated on: May 02, 2026 | 1:22 AM

ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా చట్టసభ సభ్యులకు శుక్రవారం ఒక లేఖ ద్వారా సమాచారాన్ని పంపారు. యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే వివాదానికి స్వస్తి పలకడమే ఈ ప్రకటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని నివేదికలు రాసుకొచ్చాయి.

అమెరికా చట్టాల ప్రకారం.. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సైనిక చర్యలు చేపట్టినప్పుడు, 60 రోజుల గడువు లోపు ఆ ఆపరేషన్లను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి 60 రోజులు ముగుస్తుండడంతో వైట్ హౌస్ ఒక వినూత్న చట్టపరమైన వాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ కుదిరినందున, యుద్ధం ముగిసినట్లేనని, కాబట్టి ఆ 60 రోజుల నిబంధన ఇక వర్తించదని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.

అమెరికా-ఇరాన్ మధ్య ఏప్రిల్ 7నే కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయని.. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎలాంటి కాల్పులు జరగలేదని ట్రంప్ తెలిపారు. అందుకే ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పుడు ముగిశాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే, యుద్ధం ముగిసిందని చెబుతున్నప్పటికీ స్టైట్ ఆఫ్ హర్మూజ్ వద్ద అమెరికా సైనిక దిగ్బంధనం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us