Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం.. మంటల్లో వేసినా కాలిపోదు, చెక్కుచెదరదు..!

|

Jun 09, 2022 | 9:59 PM

Unburnable Book: పూర్వం పుస్తకాలు ఉండేవి కావు.. అన్నీ తాళపత్ర గ్రంధాలే.. అయితే కొన్నాళ్లకు వాటి స్థానంలో రాగిరేకులపై రచనలు చేసేవారు.

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం.. మంటల్లో వేసినా కాలిపోదు, చెక్కుచెదరదు..!
Book
Follow us on

Unburnable Book: పూర్వం పుస్తకాలు ఉండేవి కావు.. అన్నీ తాళపత్ర గ్రంధాలే.. అయితే కొన్నాళ్లకు వాటి స్థానంలో రాగిరేకులపై రచనలు చేసేవారు. ఆ తర్వాత అభివృద్ధి చెందే కొద్దీ పేపర్‌ అందుబాటులోకి వచ్చింది. అవి కూడ శాశ్వతంగా భద్రంగా ఉంటాయా అంటే చెప్పలేం. చెదలు పట్టో, తడిచిపోయో, అగ్ని ప్రమాదాల్లోనో నాశనమయిపోతాయి. కానీ ఇక్కడ ఓ పుస్తకం వీటన్నిటికంటే ఎంతో ప్రత్యేకమైనది. దీనిని కణకణమండే మంటల్లో వేసినా కాలదు.. చెక్కుచెదరదు.

మార్గరెట్‌ అట్వుడ్‌ రాసిన ‘ది హ్యాండ్‌ మెయిడ్స్ టేల్’ అనే క్లాసిక్‌ నవలని ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్‌ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్‌ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్‌ని ఉపయోగించి ఈ బుక్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ అన్‌బర్నబుల్ బుక్ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో దీనిని రూపొందించారట. కాగా ఈ పుస్తకం వేలంలో 130,000 డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో కోటి రూపాయలకు పైనే అన్నమాట. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును.. స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే ‘పెన్‌ అమెరికా’ సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట.

ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదేనట. ఈ అన్‌బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్‌మెయిడ్స్ ‘పెన్‌ అమెరికా’ కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆ పుస్తక రచయిత అట్వుడ్‌.. 2200 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతలో కూడా ఈ పుస్తకం చెక్కుచెదరదని, పైగా ఓ ప్రత్యేకమైన ఇంక్‌తో దీనిని ముద్రించినట్లు బుక్‌ డిజైనర్లు తెలిపారు. ఒక కెనడా రచయిత ఫ్లేమ్‌ త్రోవర్‌తో ఈ పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.