విమానం కూల్చేందుకు కుట్ర.. ఫ్లైదుబాయ్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన యూఏఈ..

వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన రక్తపాతం వ్యవహారం అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కాక్‌పిట్‌లోని ఎమర్జెన్సీ గొడ్డలితో భారత కెప్టెన్‌పై ఒమన్ కో-పైలట్ జరిపిన దాడిని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించింది. తీవ్ర గాయాలతోనే విమానాన్ని కాపాడి 174 మంది ప్రాణాలు నిలిపిన భారత పైలట్ స్మిత్ మచార్‌ను నిజమైన హీరోగా కొనియాడుతూ యూఏఈ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారు.

విమానం కూల్చేందుకు కుట్ర.. ఫ్లైదుబాయ్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన యూఏఈ..
Uae Declares Flydubai Cockpit Attack A Terrorist Act

Updated on: Oct 03, 2026 | 6:00 PM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న భయానక ఘటనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించింది. విమానంలోని ఎమర్జెన్సీ గొడ్డలితో ఒమన్ కో-పైలట్ భారత కెప్టెన్‌పై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడని యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడించారు. యూఏఈ అటార్నీ జనరల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విమానం గాల్లో ఉండగా ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ, విమానంలో ఉండే ఎమర్జెన్సీ క్రాష్ యాక్స్‌తో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం విమానం నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు యత్నించాడు. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ భారత కెప్టెన్ ధైర్యంగా కాక్‌పిట్ డోర్ తెరవడంతో.. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు లోపలికెళ్లి నిందితుడిని బంధించారు.

భారత కెప్టెన్‌పై యూఏఈ ప్రశంసల జల్లు.. నిజమైన హీరో

మరణం అంచుల దాకా వెళ్లినా సంయమనం కోల్పోకుండా 174 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచార్‌ను యూఏఈ అత్యున్నత దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ కొనియాడారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఫ్లైదుబాయ్‌కి చెందిన భారతీయ పైలట్ స్మిత్ మచార్ ఎంతో గొప్పవాడు. పెను విపత్తు, అత్యంత ప్రమాదకరమైన ఉగ్రదాడి ఎదురైన వేళ ధైర్యం, బాధ్యతకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపిన కర్తవ్యనిష్ఠ, సమయస్ఫూర్తి ఆయన్ను నిజమైన హీరోగా నిలబెట్టాయి’’ అని ప్రశంసించారు.

తీవ్రవాద భావజాలంతో గతంలోనే సస్పెన్షన్..

నిందితుడు హమామ్ అల్-హమామీ నేపథ్యంపై దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. గతంలోనే ఇతని తీవ్రవాద ఆలోచనలపై ఒమన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఒమన్ ఎయిర్ ఇతడిని విమానాలు నడపకుండా నిషేధించి, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకు మార్చింది. ఆ తర్వాత రాయల్ ఎయిర్ మరాక్ సంస్థలో పనిచేసిన నిందితుడు, అనంతరం ఫ్లైదుబాయ్‌లో చేరాడు. అంతటి అనుమానాస్పద చరిత్ర ఉన్న వ్యక్తిని ఫ్లైదుబాయ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా విధుల్లోకి ఎలా తీసుకుందన్న దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దాడి జరిగిన రోజే ఆల్ ఖైదా ఉగ్రవాది వీడియో పోస్ట్

హమామ్ పేరిట ఉన్న సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఘటన జరిగిన రోజే ఆ ప్రొఫైల్ నుంచి రెండు అనుమానాస్పద పోస్టులు వచ్చాయి. అందులో కాక్‌పిట్ దృశ్యాలతో పాటు మాజీ అల్ ఖైదా అగ్రనేత ఐమన్ అల్ జవహరి ఫొటో ఉన్న వీడియోలు ఉన్నాయి. అంతేకాకుండా 2009లో ఏడుగురు సీఐఏ అధికారుల ప్రాణాలు తీసిన ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది హుమామ్ ఖలీల్ అబూ ములావ్ వీడియోలు కూడా ఉండటం గమనార్హం.

యూనివర్సిటీ రికార్డుల ప్రకారం.. నిందితుడు బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీలో 2023లో ఏవియేషన్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ మొత్తం కుట్ర వెనుక ఏయే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందనే కోణంలో యూఏఈ దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us