ఆహారంలో విషపూరిత పెయింట్.. చైనా నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు!
చైనాలోని ఓ నర్సరీలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు పెట్టే ఆహారం ఆకర్షణీయంగా కనిపించాలని ఆన్ లైన్ లో ఆర్డరు పెట్టి తెప్పించిన పెయింట్ ను కేకుల్లో బన్ లలో కలిపారు. దీంతో 200 మందికి పైగా చిన్నారులు, సిబ్బంది అస్వస్థతకు గురి కాగా, రక్తపరీకల్లో ప్రమాదకర స్థాయిలో సీసం (లెడ్) ఉన్నట్లు తేలింది. నర్సరీ స్కూలు యజమానురాలికి కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో వంటగది సిబ్బందికి కూడా జైలు శిక్షలు పడ్డాయి.

చైనాలోని ఓ నర్సరీలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలకు పెట్టే ఆహారం ఆకర్షణీయంగా కనిపించాలని ఆన్ లైన్ లో ఆర్డరు పెట్టి తెప్పించిన పెయింట్ ను కేకుల్లో బన్ లలో కలిపారు. దీంతో 200 మందికి పైగా చిన్నారులు, సిబ్బంది అస్వస్థతకు గురి కాగా, రక్తపరీకల్లో ప్రమాదకర స్థాయిలో సీసం (లెడ్) ఉన్నట్లు తేలింది. నర్సరీ స్కూలు యజమానురాలికి కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో వంటగది సిబ్బందికి కూడా జైలు శిక్షలు పడ్డాయి.
ఆహారంలో విషపూరిత పెయింట్.. ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
చైనా గాన్సు ప్రావిన్స్‌లోని నర్సరీని లీ హుయిఫాంగ్ నిర్వహించేది. 2025 జూలైలో చిన్నారులు ఒకేసారి అనారోగ్యానికి గురికావడంతో రక్త పరీక్షలు నిర్వహించగా మొత్తం 247 మంది రక్తంలో సీసం స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు సీసం విష ప్రభావానికి 235 మంది చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తినడానికి పనికి రాదని స్పష్టంగా లేబుల్ చేసిన పెయింట్‌ను ఆన్ లైన్ లో ఆర్డరు పెట్టి తెప్పించి, పిల్లలకు సిబ్బందికి వడ్డించే ఆహారంలో కలపాలని వంట సిబ్బందిని లీ ఆదేశించింది. ఆహారం ఆకర్షణీయంగా కనిపించాలనే ఆమె ఇలా చేసినట్లు తెలిసింది.
ఆహారంలో ప్రమాదకర స్థాయిలో సీసం
నర్సరీలో వడ్డించిన ఆహార నమూనాలను పరీక్షించగా, వాటిలో సీసం పరిమాణం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఎర్ర ఖర్జూరాలతో చేసిన కేకులలో కిలోకు 1,052 మిల్లీగ్రాములు, సాసేజ్, మొక్కజొన్న బన్‌లలో కిలోకు 1,340 మిల్లీగ్రాముల సీసం బయటపడింది. పిల్లలకు పెట్టే ఆహారంలో ఇంతటి విషపూరిత పదార్థాలు కలపడం తీవ్ర కలకలం రేపింది.
నర్సరీ యజమానురాలికి జీవిత ఖైదు
ఈ కేసును విచారించిన లాంజౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నర్సరీ యజమానురాలు లీ హుయిఫాంగ్‌ను తాజాగా దోషిగా నిర్ధారించింది. విషపూరిత ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన నేరంపై జీవిత ఖైదు విధించింది. ఆమె వ్యక్తిగత ఆస్తుల నుంచి 5 లక్షల యువాన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ మొత్తం సుమారు 74,700 అమెరికన్ డాలర్లకు సమానం. నర్సరీ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ ఝీ జింగ్‌లిన్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 3 లక్షల యువాన్ల జరిమానా వేసింది కోర్టు. ఈ కేసులో మరో నలుగురు వంట గది సిబ్బందికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.
కేసును కప్పిపుచ్చే ప్రయత్నం?
ఈ ఘటనలో రక్త పరీక్షల ఫలితాలను తారుమారు చేయడానికి కొందరు ప్రయత్నించినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వ్యవహారంలో ప్రాంతీయ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది జోక్యం చేసుకున్నారని, నర్సరీలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
పిల్లలకు సీసం ఎంత ప్రమాదకరం?
సీసం (Lead) మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే విషపూరిత లోహాలలో ఒకటి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. పిల్లల ఎదుగుదల, నేర్చుకునే సామర్థ్యం, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చిన్నారులు ఎదుగుతున్న దశలో విషపదార్థాలకు గురైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఘటన తర్వాత విద్యాసంస్థల్లో చిన్నారులకు అందించే భోజనానికి సంబంధించి చైనా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆహార పదార్థాల ప్రతి కొత్త బ్యాచ్‌ను పరీక్షించడం, పిండి, బియ్యం, వంటనూనె వంటి నిత్యావసరాలను కేంద్రీకృత వ్యవస్థ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది.