
మారుతున్న ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో భారత్-రష్యా సంబంధాలు కేవలం చారిత్రక బంధం మాత్రమే కాదు, అవి కాలపరీక్షకు నిలబడిన ధృడమైన భాగస్వామ్యమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రక్షణ, ఇంధనం, వాణిజ్యం, దౌత్యపరమైన అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
2026 సెప్టెంబర్‌లో భారతదేశంలో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని అలీపోవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన విజయవంతమైన నేపథ్యంలో, ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన కోసం ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రపంచ వేదికపై భారతదేశం పోషిస్తున్న నిర్ణయాత్మక పాత్రకు రష్యా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం కొత్త పుంతలు తొక్కుతోందని అలీపోవ్ తెలిపారు. మిగిలిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ త్వరలోనే అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా సత్తాతో ముడిపడిన బ్రహ్మోస్ క్షిపణులు, ఏకే-203 రైఫిల్‌ల తయారీని రష్యా-భారత్ విజయగాథలుగా ఆయన అభివర్ణించారు. అత్యాధునిక ఎస్‌యు-57 యుద్ధ విమానాలపై భారత్ ఆసక్తి కనబరిచిందని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా రక్షణ ఒప్పందాల పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు అలీపోవ్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌కు రష్యా ఒక నమ్మకమైన ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందన్నారు. ముడి చమురు, ఎల్‌పిజి సరఫరాలను రష్యా నిరంతరం కొనసాగిస్తుందని రాయబారి అలీపోవ్ హామీ ఇచ్చారు. “భారత్-రష్యా మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. ఇది కొంచెం కష్టమైనా, ఖచ్చితంగా సాధించదగినదే.” అని డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చమురు కొనుగోళ్ల వల్ల వాణిజ్యం రష్యా వైపు మొగ్గు చూపుతోంది. దీనిని సమతుల్యం చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాల ఎగుమతులను పెంచాలని భారత్‌ను రష్యా కోరుతోంది. ముఖ్యంగా, 95 శాతం వాణిజ్య లావాదేవీలు సొంత కరెన్సీల్లోనే జరుగుతుండటం వల్ల అమెరికా ఆంక్షల ప్రభావం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలపై అలీపోవ్ స్పందిస్తూ, అమెరికా – ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ఇరాన్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని, శాంతియుత అణుశక్తిని ఉపయోగించుకునే హక్కును గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ దేశాల ఒత్తిడిని అధిగమిస్తూ, భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టంగా ముందుకు సాగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే, భవిష్యత్తులో రక్షణ, ఆర్థిక మరియు దౌత్య రంగాల్లో భారత్-రష్యా బంధం ఒక కొత్త అధ్యాయానికి తెరలేపనుందని స్పష్టమవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..