
Voyager 1 Spacecraft: 1977లో నాసా వాయేజర్-1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. సౌర కుటుంబం వెలుపలికి ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక 2026 నవంబర్ 18న భూమి నుంచి ఒక కాంతి దినం దూరాన్ని చేరుకుంది. అంటే భూమి నుంచి దాదాపు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. ఈ దూరం చేరుకోవడానికి దానికి 49 ఏళ్లకు పైగా సమయం పట్టింది. గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న వాయేజర్-1 ఇంత దూరంలో ఉన్నప్పటికీ భూమికి సంకేతాలను పంపుతూనే ఉంది.
వాయేజర్-1లో అమర్చిన గోల్డెన్ రికార్డు సాధారణ రికార్డు కాదు. బంగారు పూత పూసిన ఈ ప్రత్యేక డిస్క్‌లో భూమి, మనుషులు, ప్రకృతి, మన సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరిచారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా గ్రహాంతర నాగరికత ఈ వ్యోమనౌకను గుర్తిస్తే దాని ద్వారా భూమి గురించి తెలుసుకోవాలన్నదే దీని వెనుక ఉన్న ఆలోచన.
అందుకే ఇందులో మన ప్రపంచానికి సంబంధించిన 115 చిత్రాలు, ప్రకృతిలో వినిపించే శబ్దాలు, సంగీతం, 55 భాషల్లో పలకరింపులు పొందుపరిచారు. మనుషుల శరీర నిర్మాణం, డీఎన్ఏ, శిశువు జననం, కుటుంబాలు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు, భవనాలు, ఆహారం, రోజువారీ జీవితానికి సంబంధించిన చిత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు.. తాజ్‌మహల్, చైనా గ్రేట్ వాల్, సిడ్నీ ఒపెరా హౌస్, గోల్డెన్ గేట్ బ్రిడ్జి వంటి ప్రసిద్ధ నిర్మాణాల ఫొటోలనూ చేర్చారు.
భూమిపై జీవితం ఎలా ఉంటుందో తెలియచేసేందుకు ఈ రికార్డులో అనేక శబ్దాలను పొందుపరిచారు. సముద్రపు అలలు, గాలి, ఉరుములు, పక్షుల కిలకిలలు, తిమింగలాల శబ్దాలు, ఇతర జంతువుల అరుపులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు బాచ్, బీథోవెన్, మొజార్ట్ వంటి ప్రముఖ సంగీతకారుల స్వరాలు, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన సంప్రదాయ సంగీతాన్ని చేర్చారు. అమెరికన్ గాయకుడు చక్ బెర్రీ ప్రసిద్ధ పాట ‘జానీ బి. గూడ్’ కూడా ఇందులో ఉంది.
ఈ బంగారు రికార్డులో భారతీయ సంగీతానికి కూడా చోటు కల్పించారు. జైపూర్-అత్రౌలి ఘరానాకు చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయని కేసర్‌బాయి కేర్కర్ ఆలపించిన ‘జాత్ కహాన్ హో’ అనే సంగీతాన్ని ఇందులో చేర్చారు. అంతేకాదు భూమిపై మాట్లాడే 55 భాషల్లో భారతీయ భాషలకూ స్థానం దక్కింది. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, నేపాలీ, పంజాబీ, రాజస్థానీ, తెలుగు, ఉర్దూ భాషల్లో పలకరింపులను రికార్డు చేశారు. హిందీలో ‘ఈ ప్రపంచ నివాసుల నుంచి మీకు శుభాకాంక్షలు’ అనే అర్థం వచ్చే సందేశం ఉంది. మరాఠీలో, ‘భూమిపై నివసించే ప్రజలు మీకు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు’ అనీ పంజాబీలో ‘ మా ఇంటికి స్వాగతం. మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషంగా ఉంది’ అనే సందేశాన్ని పొందుపరిచారు.
How Can Aliens Decode and Play NASA’s Golden Record?
Nasas Golden Record Message To Aliens
ఈ రికార్డును కనుగొనే గ్రహాంతరవాసులు దాన్ని ఎలా ప్లే చేయాలో, అందులోని ఫొటోలు, శబ్దాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియచేసే సూచనలను కవర్‌పై చెక్కారు. అంతేకాదు సౌర కుటుంబం ఎక్కడ ఉందో గుర్తించేందుకు 14 పల్సార్ల స్థానాలను చూపించే ప్రత్యేక పటాన్ని రూపొందించారు. హైడ్రోజన్ పరమాణువులో జరిగే మార్పును విశ్వవ్యాప్తంగా అర్థం చేసుకోగలిగే కాలం, పొడవు కొలమానంగా ఉపయోగించేలా సూచనలు ఇచ్చారు.
అయితే ఈ రికార్డును ఏదైనా గ్రహాంతర నాగరికత తప్పకుండా కనుగొంటుందని చెప్పలేం. అది ఒక నిర్దిష్ట గ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన సందేశం కూడా కాదు. అంతరిక్షంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా దొరికే అవకాశం ఉందన్న ఆశతో పంపిన పరిచయ పత్రం మాత్రమే.
నాసా అంచనాల ప్రకారం వాయేజర్-1 మరో నక్షత్ర వ్యవస్థకు సమీపంగా వెళ్లడానికి సుమారు 40 వేల సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటివరకు అది అంతరిక్షంలో తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. అంటే దాదాపు అర్ధ శతాబ్దం క్రితం భూమి నుంచి బయలుదేరిన ఈ చిన్న వ్యోమనౌక మనుషుల గురించి, మన సంస్కృతి గురించి చెప్పే ఓ సందేశాన్ని విశ్వంలోకి మోసుకెళ్తోంది. ఏదో ఒక రోజు ఆ సందేశాన్ని ఎవరైనా చదువుతారా? భూమి గురించి తెలుసుకుంటారా? అన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి