
కంట్లో చిన్న నలుసు పడితేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి కంట్లో ఏకంగా విత్తనం మొలకెత్తింది. కొమ్మ తగిలి కంట్లోకి వెళ్లిన చిన్న విత్తనం అక్కడే ఉండిపోయి క్రమంగా మొలకెత్తింది. దీంతో ఆ వ్యక్తి నెలల తరబడి తీవ్రమైన తలనొప్పి, కంటి మంట, వాపుతో బాధపడ్డాడు. చివరకు వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. ఈ విచిత్ర ఘటన సైబీరియాలో జరిగింది.
సైబీరియాకు చెందిన 42 ఏళ్ల మాక్సిమ్ స్లెప్ట్సోవ్ వృత్తిరీత్యా వెల్డర్, ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో తన స్నేహితుడిని కలిసేందుకు సైబీరియాలోని మారుమూల అబియిస్కీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ చేపలు పట్టడం, బెర్రీ పండ్లు సేకరించడం చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.
ఓ చెట్టు కొమ్మ అతడి కంటికి బలంగా తగిలింది. దీంతో ముఖంపై కూడా గాయమైంది. వెంటనే కంటిని నీటితో శుభ్రం చేసుకున్న మాక్సిమ్.. లోపలికి వెళ్లిన చెట్టు బెరడు ముక్కను బయటకు తీశాడు. అంతా సర్దుకుందని భావించాడు. కానీ ఓ చిన్న విత్తనం కంట్లోనే ఉండిపోయింది.
కొద్ది రోజుల తర్వాత కంట్లో దురద, నొప్పి, ఎర్రబడటం, నీరు కారడం మొదలయ్యాయి. రోజులు గడిచేకొద్దీ పరిస్థితి తీవ్రమైంది. కంట్లో వాపు, రెండు వస్తువులుగా కనిపించడం (డబుల్ విజన్) మొదలైంది. తీవ్ర తలనొప్పితో మాక్సిమ్ నరకం అనుభవించాడు. ఉదయం నిద్రలేవగానే భరించలేని తలనొప్పి వచ్చేది. అతడిది మారుమూల ప్రాంతం కావడంతో సమీపంలోని కంటి ఆసుపత్రికి వెళ్లడం కష్టంగా మారింది.
చివరకు ప్రాంతీయ రాజధాని యాకుట్స్క్‌కు చేరుకున్న మాక్సిమ్.. అక్కడి ఎమర్జెన్సీ ఆప్టోమెట్రీ కేంద్రంలో వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు చేసిన వైద్యులు కంటిలో విత్తనాన్ని గుర్తించారు. ఆ విత్తనం నుంచి చిన్న వేరు బయటకు వచ్చింది. అది కంట్లోని తెల్లటి భాగాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొర కన్‌జంక్టివా (Conjunctiva) కణజాలంలోకి చొచ్చుకుపోయింది. దాని వేరు సుమారు 3 మిల్లీమీటర్ల పొడవు పెరిగింది.
నేత్ర వైద్యురాలు ఎలిజవెటా కార్పోవా మత్తుమందు ఇచ్చి, సూది సహాయంతో ఆ విత్తనాన్ని జాగ్రత్తగా తొలగించారు. అప్పటికే దాని వేరు కంటి కణజాలంలో పెరగడంతో ఆ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించారు. తన వైద్య జీవితంలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని కార్పోవా తెలిపారు. విత్తనం తొలగించిన తర్వాత మాక్సిమ్‌కు నెలల తరబడి వేధించిన తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది.చిన్నపాటి గాయంగా భావించి నిర్లక్ష్యం చేసిన ఘటన చివరకు ఇంతటి సమస్యకు దారితీసింది. కంటికి ఏదైనా వస్తువు తగిలినా, నొప్పి, ఎర్రబడటం లేదా చూపులో మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలనే విషయాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.