కెప్టెన్ ప్రార్థన.. కో పైలట్ అరుపులు కేకలు.. క్షణాల్లో కుప్పకూలిన విమానం!

ఫ్లోరిడా విమాన ప్రమాదానికి ముందు కాక్‌పిట్ ఆడియో, రేడియో సంభాషణలు అందరినీ కలచివేస్తున్నాయి. పైలట్లు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. విమానం అదుపు తప్పి కిందకు దూసుకెళుతుండగా కెప్టెన్ దేవుడిని ప్రార్థించగా.. 20 ఏళ్ల యువ కోపైలట్ భయంతో కేకలు వేసింది. ప్రియుడికి చివరి సందేశం పంపింది.

కెప్టెన్ ప్రార్థన.. కో పైలట్ అరుపులు కేకలు.. క్షణాల్లో కుప్పకూలిన విమానం!
Learjet Captain Prays Co Pilot Last Text To Boyfriend

Updated on: Nov 03, 2026 | 1:34 PM

ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బహామాస్‌కు వెళ్తున్న లియర్‌జెట్ విమానం ప్రయాణిస్తుండగా వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. విమానంలో మంచు పేరుకుపోతుండటంతో పైలట్లు పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు తెలియచేసారు. వాతావరణ పరిస్థితులు దిగజారడంతో విమానాన్ని 37 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు అనుమతి కోరారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అందుకు అంగీకరించారు కూడా. చూస్తుండగానే క్షణాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో విమానం కిందికి దూసుకెళ్లింది.  మధ్యాహ్నం 12.48 గంటలకు విమానం నుంచి మే డే సందేశం వెళ్లింది.  ‘విమానం ఓవర్‌స్పీడ్ తో నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో కిందకు దూసుకెళుతోంది’ అని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారం ఇస్తూ భయంతో కేకలు వేశారు.

ప్రియుడికి చివరి మెసేజ్

భయంతో కేకలు వేసిన 20 ఏళ్ల కో పైలట్ నథాలియా  ప్రియుడికి చివరి మెసేజ్ పంపింది.  విమానం తీవ్ర కుదుపులకు లోనవుతోందని, రెక్కలపై మంచు పేరుకుపోతోందని రాసింది. ఆమె ప్రియుడు కూడా పైలట్ కావడంతో తరచూ కలిసి విమానాలు నడిపేవారు. ఆ వెంటనే క్షణాల్లో పరిస్థితి అదుపుతప్పి విమానం కిందకు దూసుకుపోయింది.

 

కెప్టెన్ ప్రార్థన.. కోపైలట్ ఆర్తనాదాలు!

 

 

 

విమాన కాక్‌పిట్‌లో చివరి క్షణాల్లో భయానక పరిస్థితులు LiveATC.net ఆడియోలో  తెలిసింది.  55 ఏళ్ల కెప్టెన్ జెఫ్ గ్రెగరీ ఆ సమయంలో ‘లార్డ్స్ ప్రేయర్’ చదివినట్లు ఆడియోలో వినిపించింది. కోపైలట్ నథాలియా తీవ్ర భయంతో కేకలు వేసింది. ‘విమానం నేలను ఢీకొట్టబోతోంది’ అని బిగ్గరగా అరిచింది. చివరగా ఆమె  రేడియో సందేశంలో ‘మనకు ఇంక సమయం లేదు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

భారీగా మంటలు.. తొమ్మిది మంది మృతి

 

విమానం పామ్ బీచ్ కౌంటీలో రోడ్డుపై కుప్పకూలింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే వందలాది ఇళ్లు ఉన్నాయి. విమానం నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి నేలపై భారీ గొయ్యి ఏర్పడింది. ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో టెక్‌ కోటీశ్వరుడు ఆడమ్ రాబిన్సన్,  భార్య హెలెన్ షార్ప్, నాలుగేళ్ల కుమార్తె ఎమ్మా, రెండేళ్ల కుమారుడు చార్లీ ఉన్నారు.  పిల్లల సంరక్షకురాలు నానీ అనితా మరియా సెటినా, కుటుంబ స్నేహితులు రాచెల్ రీడ్, చార్మి ఫెహర్ కూడా మరణించారు.

మంచు వాతావరణం కారణమా?

 

విమాన ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి.  ప్రతికూల వాతావరణం,  మంచు పేరుకుపోవడం,  విమానం నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us