యూట్యూబ్‌లో వీడియో పెట్టిన పాపానికి 74 కొరడా దెబ్బలు!

Iran Hijab Law: ప్రపంచం ఏఐ, ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే ఓ మహిళ తనకు నచ్చిన దుస్తులు ధరించి పాట పాడినందుకు కొరడా దెబ్బలు ఎదుర్కొంది. ఒక యూట్యూబ్ వీడియో కారణంగా ఇరాన్‌కు చెందిన ఓ యువ గాయనికి ఎదురైన శిక్ష ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ పాట పాడటం ఆమె చేసిన తప్పా? తలపై హిజాబ్ లేకుండా కెమెరా ముందుకు రావడమే నేరమైందా? కేవలం హిజాబ్ ధరించకుండా పాట పాడిందనే కారణంతో ఆమెకు ఏకంగా 74 కొరడా దెబ్బలు విధించారు. తాజాగా ఈ శిక్షను అధికారులు అమలు చేసినట్లు ఆమె న్యాయవాది వెల్లడించడంతో ఈ ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది.

యూట్యూబ్‌లో వీడియో పెట్టిన పాపానికి 74 కొరడా దెబ్బలు!
Iranian Singer Receives 74 Lashes For Performing Without Hijab In Viral Youtube Video

Updated on: Nov 24, 2026 | 11:08 AM

Women’s Rights in Iran: ఆ గాయని పేరు పరస్తూ అహ్మది (Parastoo Ahmadi) వయసు కేవలం 29 ఏళ్లు. సంగీతంపై ఉన్న ఆసక్తితో ఆమె ఓ ప్రత్యేకమైన ప్రదర్శనను రూపొందించి యూట్యూబ్‌లో విడుదల చేసారు.  వీడియోలో ఆమె పాట పాడటం, హిజాబ్ లేకుండా వీడియో రికార్డు చేయడం ఆమెను న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టింది.

వేదికపై గానం.. హిజాబ్ లేకుండానే ప్రదర్శన!

2024 డిసెంబర్‌లో పరస్తూ అహ్మది యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఓ పురాతన  భవన సముదాయంలో వీడియోను చిత్రీకరించారు. చుట్టూ మసక వెలుతురు.. ఎదురుగా ప్రేక్షకుల ప్రాంగణం.. మధ్యలో సంగీత కళాకారులు.. ఇలా ఎంతో ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పరస్తూ పొడవాటి గౌను ధరించారు. అయితే ఆమె తలపై హిజాబ్ లేదు. ఆమెతో పాటు నల్లటి దుస్తులు ధరించిన నలుగురు సంగీత కళాకారులు కూడా ప్రదర్శన ఇచ్చారు. ఎలాంటి ప్రేక్షకులు లేకుండానే రికార్డ్ చేసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అయితే ఈ వీడియో అనూహ్యంగా వైరల్ అయింది. లక్షలాది మంది వీక్షించారు. చాలామంది ఆమె ప్రదర్శనను అభినందించారు. కానీ ఇరాన్ అధికారుల దృష్టిలో మాత్రం ఇది నిబంధనల ఉల్లంఘనగా మారింది.

ఇరాన్‌లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మహిళలు బహిరంగంగా పాటలు పాడటంపైనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పరస్తూ అహ్మదిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెపై అసభ్యకర కంటెంట్ తయారీ, ప్రసారం, ప్రచారంలో భాగస్వాములయ్యారని ఆరోపణలు మోపారు. ప్రదర్శనలో పాల్గొన్నవారికి, వీడియో తయారీలో సహకరించినవారిపైనా కేసు పెట్టారు. పరస్తూతో పాటు నలుగురు సంగీత కళాకారులు, ఆమె ప్రొడక్షన్ బృందానికి చెందిన మరో నలుగురిని నిందితులుగా చేర్చారు.

ఈ కేసును విచారించిన ఇరాన్ అధికారులు 2025 జూన్‌లో పరస్తూ అహ్మదికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఆమెతో పాటు మరో ఎనిమిది మందికి కూడా శిక్షలు ఖరారయ్యాయి. ఈ తీర్పుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓ సంగీత ప్రదర్శనలో హిజాబ్ ధరించలేదనే కారణంతో ఇంత కఠినమైన శిక్ష విధించడం ఏమిటంటూ పలువురు ప్రశ్నించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరస్తూ అహ్మది న్యాయవాది మోస్తఫా నీలీ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమెకు విధించిన 74 కొరడా దెబ్బల శిక్షను అధికారులు ఇప్పటికే అమలు చేశారు. ఈ కేసులో శిక్షలు ఎదుర్కొన్న మిగిలిన నలుగురు సంగీత కళాకారులు, మరో నలుగురు ప్రొడక్షన్ సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పరస్తూ అహ్మదికి విధించిన శిక్షపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ (Amnesty International) గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో అప్పీల్‌లోనూ శిక్షను సమర్థించడంపై ఆందోళన తెలిపింది. ఇరాన్ అధికారులు ఈ శిక్షను అమలు చేయకూడదని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ తాజాగా శిక్ష అమలైనట్లు ఆమె న్యాయవాది వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.

మహ్సా అమిని మరణం తర్వాత మారుతున్న పరిస్థితులు!

ఇరాన్‌లో మహిళల హిజాబ్ నిబంధనలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా 2022 సెప్టెంబర్‌లో మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మరణించడం  సంచలనం సృష్టించింది. హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో మహ్సా అమినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించడంతో ఇరాన్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. మహిళలు తమ దుస్తులను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు.

ఆ ఘటన తర్వాత ఇరాన్‌లో చాలా మంది మహిళలు హిజాబ్ నిబంధనలను బహిరంగంగానే ధిక్కరిస్తున్నారు. తలపై వస్త్రం లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరస్తూ అహ్మది ఘటన మరోసారి మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛపై చర్చకు దారితీసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us