Video: ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!

సముద్రపు దొంగల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ లో సోమాలియా దొంగలు ఇరాన్‌కు చెందిన నౌకను,  20 మంది సిబ్బందిని హైజాక్‌ చేసారు.  భారత నౌకాదళం, భారత వైమానిక దళం (IAF) కలిసి ఆపరేషన్‌ చేపట్టాయి. ముంబైకి 3 వేల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఈ సాహసోపేత ఆపరేషన్ నిర్వహించాయి.

Video: ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
Indian Navy Rescues Crew Members From Hijacked Iran Vessel After Operation

Updated on: Nov 03, 2026 | 5:58 PM

సముద్రపు దొంగల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ లో సోమాలియా దొంగలు ఇరాన్‌కు చెందిన నౌకను,  20 మంది సిబ్బందిని హైజాక్‌ చేసారు.  భారత నౌకాదళం, భారత వైమానిక దళం (IAF) కలిసి ఆపరేషన్‌ చేపట్టాయి. ముంబైకి 3 వేల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఈ సాహసోపేత ఆపరేషన్ నిర్వహించాయి.

నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు

ఇరాన్‌కు చెందిన ‘అజిని’ (Azini) నౌకను అక్టోబర్ 29న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సోమాలియాలోని బందర్ బేలా, హఫున్ తీర ప్రాంతాల మధ్య నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనను భారత నౌకాదళం తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే సముద్రపు దొంగలు ఈ నౌకను కేవలం తమ ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా, ఇతర వాణిజ్య నౌకలపై దాడులు చేసేందుకు ‘మదర్ షిప్‌’గా ఉపయోగించే ప్రమాదం ఉందని నేవీ అంచనా వేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగింది.

48 గంటల ప్రత్యేక ఆపరేషన్

నౌకను గుర్తించి, సముద్రపు దొంగల చెర నుంచి సిబ్బందిని విడిపించేందుకు భారత నేవీ ప్రత్యేక యుద్ధ నౌకను రంగంలోకి దించింది. దీనికి తోడుగా సముద్రంపై నిఘా నిర్వహించే విమానాన్ని కూడా మోహరించింది. నిరంతర నిఘా ద్వారా అజిని నౌక ఆచూకీని గుర్తించింది. నౌక తప్పించుకోకుండా ఎలాంటి ప్రాణహాని కలిగించని వ్యూహాత్మక చర్యలు చేపట్టింది.
సీ-17 (C-17) విమానం ద్వారా కమాండోలను రంగంలోకి దించారు. సముద్రపు దొంగల నుంచి నౌకను, 20 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించారు.

నేవీకి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు

ఆపరేషన్‌ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత నౌకాదళాన్ని అభినందించారు. సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా ఆపరేషన్ నిర్వహించారని ప్రశంసించారు.
సాయుధ సముద్రపు దొంగల నుంచి నౌకను స్వాధీనం చేసుకుని, సిబ్బందిని సురక్షితంగా విడిపించడంలో నేవీ చూపిన వేగం, సమర్థత అభినందనీయమని ఎక్స్‌ (X) వేదికగా తెలిపారు. భారత సాయుధ దళాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను కాపాడటంలో సత్తా చాటాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఇరాన్ రాయబార కార్యాలయం ప్రశంసలు

తమ దేశానికి చెందిన 20 మంది సిబ్బందిని రక్షించిన భారత నేవీకి ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో భారత సాయుధ దళాలను ప్రశంసించింది. భారత నౌకాదళం, వైమానిక దళం ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, ధైర్యం, సమన్వయం ఎంతో అభినందనీయమని పేర్కొంది. సరిహద్దులకు అతీతంగా మానవతా దృక్పథంతో ప్రాణాలను కాపాడటంలో భారత్ చూపిన నిబద్ధతకు ఈ ఆపరేషన్ నిదర్శనమని తెలిపింది. భారత్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర సహకారం, ఐక్యతకు ఈ మానవతా ఆపరేషన్ ప్రతీకగా నిలుస్తుందని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.

2008 నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో నిరంతర నిఘా

సముద్రపు దొంగల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు భారత నౌకాదళం చాలాకాలంగా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 2008 అక్టోబర్ 23 నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో నిరంతరంగా భారత యుద్ధ నౌక గస్తీ నిర్వహిస్తోంది. భారత సముద్ర వాణిజ్యానికి రక్షణ కల్పించడం, సముద్ర మార్గాల్లో ప్రయాణించే సిబ్బందిలో భరోసా కల్పించడం, సముద్రపు దొంగల దాడులను అడ్డుకోవడం చేస్తుంది. తాజాగా అజిని నౌకలోని 20 మందిని రక్షించిన ఆపరేషన్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కల్పించడంలో భారత్ తన నిబద్ధతను మరోసారి చాటింది.

Loading...
Unable to load recommendations.
Follow Us