
తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు మద్దతు ప్రకటించారు. ఒకప్పుడు అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదుల కేసులను కోర్టులో వాదించిన ఆమె ఇప్పుడు న్యూయార్క్‌లో నేరాలు, మోసాలు, దొంగతనాలను అరికట్టడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
సరిత కొమటిరెడ్డి హార్వర్డ్ కాలేజ్, హార్వర్డ్ లా స్కూల్ నుంచి గ్రాడ్యయేషన్ పూర్తి చేసారు. న్యూయార్క్‌లో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన అల్ ఖైదా ఉగ్రదాడులు ఆమెపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదుల కేసులను ప్రభుత్వం తరపున కోర్టులో కేసు నడిపారు. ఉగ్ర సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించిన వారినీ వదిలిపెట్టలేదు. తద్వారా ఉగ్రవాద కేసుల్లో అనుభవం గడించారు.
ఉగ్రవాద కేసులతో పాటు అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులపైనా సరిత ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకొస్తున్న డ్రగ్ కార్టెల్స్ కు కోర్టు శిక్షలు వేసేలా సాక్ష్యాధారాలను సమర్పించారు. మెక్సికోకు చెందిన సినాలోవా డ్రగ్ కార్టెల్ నేతల కేసులకి ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్ గా పనిచేసారు. ఎల్ చాపో, అతడి డ్రగ్ నెట్‌వర్క్ నుంచి లంచాలు తీసుకుని ఆ ముఠా కార్యకలాపాలకు సహకరించిన మెక్సికన్ ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయడంలో విజయం సాధించారు.
ఈ అనుభవం తర్వాత అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసే అవకాశం ఆమెకు లభించింది. అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఏడాది పాటు ఈ బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 12 ఏళ్ల పాటు సాగిన తన కెరీర్‌లో ప్రజాసేవ, ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చానని సరిత చెప్పారు.
సరిత కొమటిరెడ్డి కుటుంబ మూలాలు తెలంగాణలో ఉన్నాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించారు సరిత. ఆమె తల్లి హైదరాబాద్‌లో పెరిగారు. తండ్రిది కరీంనగర్ జిల్లాలోని చేగొన్న గ్రామం. తన పిల్లలకు కూడా తాతయ్య, అమ్మమ్మల మూలాలు ఎక్కడున్నాయో తెలియచేయడం కోసం ఇప్పటికీ ఆ గ్రామానికి వెళ్తుంటామనీ సరిత మీడియాతో తెలిపారు.
న్యూయార్క్ లో అటార్నీ జనరల్ పదవికి ఎన్నికల బరిలో నిలబడిన తొలి దక్షిణాసియా సంతతి అభ్యర్థిని తనే అని సరిత అన్నారు. ఆమె అభ్యర్థిత్వంపై భారత్, దక్షిణాసియా వాసులు ఆమెను కలిసి అభినందించారు. ఆమెకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత అనేది జాతి, మతం, రాజకీయ పార్టీలకు అతీతమైన అంశమని సరిత అన్నారు.
న్యూయార్క్ ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ ను విమర్శించారు సరిత. ఆమెకు కార్యాలయం బాధ్యతల కంటే జాతీయ స్థాయి రాజకీయ గుర్తింపుపైనే ఆసక్తి ఎక్కువని ఆరోపించారు. తాను ఎన్నికైతే నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో కలిసి పనిచేసే అంశంపైనా ఆమె స్పందించారు. ప్రజల భద్రత కోసం ఎవరితోనైనా సహకరించడానికి సిద్ధమని చెప్పారు. అయితే అటార్నీ జనరల్ పదవి స్వతంత్రంగా ఎన్నికయ్యే పదవి అని గుర్తుచేశారు. అవసరమైతే విభేదాలు వచ్చినా తన అధికారాలను ఉపయోగించడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక కేసుల నుంచి డ్రగ్ కార్టెల్స్‌పై పోరాటం వరకు సాగిన తన అనుభవాన్ని ఇప్పుడు న్యూయార్క్ ప్రజల భద్రత కోసం ఉపయోగిస్తానని ఆమె చెబుతున్నారు. తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ గా గెలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.