
ఫ్రాన్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ద్రవ్యోల్బణం, విద్యా వ్యవస్థలో సమస్యలు, పోలీసుల బలప్రయోగం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. శనివారం జరిగిన ఈ ఆందోళనలు పలు నగరాలకు విస్తరించాయి. నిరసనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి బాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలో 195 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పారిస్ సహా పలు నగరాల్లో ఆందోళనలు
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని పారిస్లో సుమారు 1.10 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారు. అయితే, వాస్తవంగా పాల్గొన్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని నిరసన నిర్వాహకులు పేర్కొన్నారు. పారిస్తోపాటు రెన్నెస్, లియోన్, మార్సెయిల్ వంటి నగరాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు చారిత్రక విగ్రహాలపైకి ఎక్కగా, మరికొన్ని చోట్ల నిప్పుపెట్టడం, విధ్వంసానికి పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. లిల్లే, మార్సెయిల్ నగరాల్లోని ప్రభుత్వ భవనాల్లోకి నిరసనకారులు ప్రవేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
విద్యా వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై యువత ఆగ్రహం
ప్రారంభంలో విద్యార్థుల సమస్యలపై మొదలైన ఉద్యమం క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా మారింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని, విద్యా రంగానికి నిధులు పెంచాలని, వాతావరణ మార్పులను తట్టుకునేలా పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని యువత డిమాండ్ చేస్తోంది. పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ స్పందనలో జాప్యం, యువతపై పోలీసుల బలప్రయోగం కూడా నిరసనలకు కారణాలుగా నిలిచాయి. గత 15 ఏళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ఎడ్వర్డ్ జాఫ్రే విద్యార్థులతో సమావేశమైనప్పటికీ సమస్యల పరిష్కారంపై ఇంకా స్పష్టమైన ఒప్పందం కుదరలేదని సమాచారం.
హింసాత్మక ఘటనలు.. పోలీసుల చర్యలపై విమర్శలు
నిరసనల అనంతరం పారిస్లో కొన్ని దుకాణాలపై దాడులు, దోపిడీలు, అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు, లాఠీలు ప్రయోగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, దుకాణాలపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు.
మరోవైపు, పోలీసుల బలప్రయోగంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు చర్యలో 14 ఏళ్ల బాలుడికి దవడ విరిగినట్లు సమాచారం. అలెంకాన్లో ఓ బాలిక మెడను పోలీసు అధికారి పట్టుకున్న దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. దీంతో ఫ్రాన్స్లో ప్రభుత్వ విధానాలతోపాటు పోలీసుల వ్యవహారశైలిపైనా తీవ్ర చర్చ కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..