
థాయ్‌లాండ్‌లో నవంబర్‌లో జరిగే యి పెంగ్ (Yi Peng), లోయ్ క్రాథోంగ్ (Loy Krathong) పండుగ వేడుకల్లో భాగంగా వేలాది కాగితపు దీపాలను ఆకాశంలోకి వదులుతారు. నవంబర్ 24, 25 తేదీల్లో జరిగే వేడుకల్లో చియాంగ్ మాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో 2 లక్షలకు పైగా ఆకాశ దీపాలు వదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీపాలు విమానాల ప్రయాణ మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటంతో నవంబర్ 21 నుంచి 28 వరకు 108 విమానాలను రద్దు చేసి, 80 విమానాల సమయాలను మార్చారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 105 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నారు.
నవంబర్‌లో వచ్చే థాయ్ చాంద్రమాన క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి సమయంలో థాయ్‌లాండ్‌లో రెండు ముఖ్య సంప్రదాయ పండుగలు యి పెంగ్, లోయ్ క్రాథోంగ్ నిర్వహిస్తారు. యి పెంగ్ ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ ప్రాంతంలో జరుపుకుంటారు. ‘ఖోమ్ లోయ్’ (Khom Loi) అని పిలిచే కాగితపు దీపాలను వెలిగించి ఆకాశంలోకి వదులుతారు. జీవితంలో దురదృష్టం తొలగిపోవాలని కోరుకుంటూ దీపాలను వదలడం సంప్రదాయంగా వస్తోంది.
మరోవైపు థాయ్‌లాండ్ అంతటా లోయ్ క్రాథోంగ్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా నదులు, సరస్సులు, చెరువుల వద్దకు వెళ్లి పువ్వులు, దీపాలతో అలంకరించిన పడవ కాగితాలను నీటిలో వదులుతారు. వీటినే ‘క్రాథోంగ్’ అంటారు.
చియాంగ్ మాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ గ్రూప్ కెప్టెన్ సకన్ ఉడోన్ విమానాల షెడ్యూల్ మార్పుల వివరాలను తెలిపారు. నవంబర్ 24 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదే రోజు రాత్రి 7 గంటల నుంచి నవంబర్ 25 తెల్లవారుజామున 1 గంట వరకు విమానాలు నడపకూడదని ఎయిర్‌లైన్స్‌కు సూచించారు. .
విమానాల టేకాఫ్, ల్యాండింగ్ మార్గాలకు సమీప ప్రాంతాలను ‘రెడ్ జోన్లుగా’ గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఆకాశ దీపాలను వదలడంపై నిషేధం విధించారు. విమానాల ఇంజిన్లలోకి దీపాలు వాటి భాగాలు పొరపాటున వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీపాలు వదిలే ప్రాంతాలు, సమయాలపై విమాన పైలట్లు, విమానయాన సంస్థలకు ముందుగానే సమాచారం అందించారు. విమానాశ్రయ పరిసరాల్లో తనిఖీలను పెంచారు. స్థానిక అధికారులు, జిల్లా యంత్రాంగం కలిసి భద్రతా చర్యలు చేపడుతున్నారు.
నవంబర్ 21 నుంచి 28 మధ్య చియాంగ్ మాయ్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించి విమాన సమయాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చని తెలిపారు. ప్రయాణికుల రవాణా కోసం అదనపు ట్యాక్సీలు, షటిల్ బస్సులు, అద్దె కార్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఆన్‌లైన్ చెక్‌ఇన్, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. దేశీయ విమాన ప్రయాణికులు బయలుదేరడానికి కనీసం రెండు గంటల ముందుగా, అంతర్జాతీయ ప్రయాణికులు మూడు గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయాణికులకు తెలియచేసారు.