
అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చిన స్టార్‌షిప్ రాకెట్ పైభాగాన్ని ప్రయోగ టవర్‌పై అమర్చిన భారీ యాంత్రిక చేతులతో గాలిలోనే పట్టుకుంది. రాకెట్‌ను తిరిగి ఉపయోగించుకునే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక ముందడుగుగా నిలిచింది.
గాలిలోనే రాకెట్‌ను ఎలా పట్టుకున్నారు?
టెక్సాస్‌లోని స్టార్‌బేస్ కేంద్రం నుంచి 407 అడుగుల పొడవైన స్టార్‌షిప్‌ను స్పేస్‌ఎక్స్ ప్రయోగించింది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. కింది భాగాన్ని సూపర్ హెవీ బూస్టర్ అని, పైభాగాన్ని స్టార్‌షిప్ అని పిలుస్తారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత స్టార్‌షిప్ 26 కొత్త స్టార్‌లింక్ ఉపగ్రహాలను విడుదల చేసింది. అనంతరం భూమికి తిరిగి వచ్చే ప్రయాణాన్ని ప్రారంభించింది. సుమారు 22 గంటలకు పైగా అంతరిక్షంలో గడిపిన ఈ వ్యోమనౌక భూమి చుట్టూ 14 పరిభ్రమణాలు పూర్తి చేసింది. తిరిగి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో గంటకు సుమారు 17,000 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకుని, ఇంజన్లను తిరిగి ప్రారంభించి ప్రయోగ టవర్ వైపు చేరుకుంది. అక్కడే అసలైన అద్భుతం చోటుచేసుకుంది. మెకాజిల్లా (Mechazilla)గా పిలిచే భారీ యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను గాలిలోనే పట్టుకున్నాయి. దీంతో రాకెట్‌ను సముద్రంలో పడకుండా తిరిగి భూమిపైకి తీసుకురావడంలో స్పేస్‌ఎక్స్ కీలక విజయం సాధించింది.
బూస్టర్ మాత్రం ఎందుకు విఫలమైంది?
ఈ ప్రయోగంలో స్టార్‌షిప్ పైభాగం విజయవంతంగా తిరిగి వచ్చినప్పటికీ, కింది భాగమైన సూపర్ హెవీ బూస్టర్‌ను తిరిగి పట్టుకోవాలన్న ప్రయత్నం విఫలమైంది. తిరుగు ప్రయాణంలో బూస్టర్ ఇంజన్లు ముందుగానే ఆగిపోవడంతో దాని వ్యవస్థలు లోపాన్ని గుర్తించాయి. దీంతో అది ప్రయోగ టవర్ వైపు కాకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో వైపు మళ్లింది. చివరకు ధ్వంసమైంది. ఈ వైఫల్యానికి గల కారణాలను స్పేస్‌ఎక్స్ ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. అంటే ఒకే ప్రయోగంలో రెండు భాగాలను తిరిగి పొందాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు.
చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపడమే లక్ష్యం!
స్టార్‌షిప్ విజయవంతమైన తిరుగు ప్రయాణం భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను పంపేందుకు కీలకంగా మారనుంది. ఈ రాకెట్‌ను పూర్తిగా పునర్వినియోగించగలిగితే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నాసా తన ఆర్టెమిస్ కార్యక్రమంలో చంద్రుడిపై వ్యోమగాములను దించేందుకు స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్‌ను ల్యాండర్‌గా అభివృద్ధి చేయిస్తోంది. నాసా తాజా ప్రణాళిక ప్రకారం 2027లో ఆర్టెమిస్-3 ద్వారా కీలక సాంకేతిక పరీక్షలు, 2028లో ఆర్టెమిస్-4 ద్వారా చంద్రుడిపై మానవుల ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు, అంగారక గ్రహంపై మానవ నివాసాలను ఏర్పాటు చేయాలన్నది ఎలాన్ మస్క్ దీర్ఘకాలిక లక్ష్యం. మొత్తానికి, గాలిలోనే స్టార్‌షిప్‌ను పట్టుకోవడం స్పేస్‌ఎక్స్ సాధించిన చారిత్రాత్మక విజయం. అయితే రెండు రాకెట్ భాగాలను విజయవంతంగా తిరిగి పొందడం, వాటిని తక్కువ ఖర్చుతో మళ్లీ ప్రయోగించడం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..