
Cargo Ship Sinks in Strait of Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ కార్గో నౌక మునిగిపోవడంతో సముద్రంలో చెల్లాచెదురుగా తేలుతున్న కంటైనర్లలోని వస్తువులను సేకరించేందుకు వందలాది మంది ఇరాన్ జాలర్లు సముద్రంలోకి వెళ్లారు. ఐఫోన్లు, పెర్ఫ్యూమ్లు, ఇతర విలువైన వస్తువులు లభిస్తాయనే ఆశతో చిన్న పడవల్లో బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రంలో పాక్షికంగా మునిగిన కంటైనర్ల మధ్య జాలర్లు పడవలతో తిరుగుతున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సింగపూర్‌లో రిజిస్టర్ అయిన జీఎఫ్ఎస్ ప్రైడ్ (GFS Pride) అనే కార్గో నౌక అక్టోబర్ 14న అగ్నిప్రమాదం కారణంగా సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సింగపూర్ అధికారులు వెల్లడించారు. నౌక మునిగిన తర్వాత అందులోని సరుకు సముద్రంలో చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో స్థానిక జాలర్లు విలువైన వస్తువుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఓ వీడియోలో చిన్న పడవతో ఒక పెద్ద షిప్పింగ్ కంటైనర్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం కనిపించింది. మరో వీడియోలో ఐఫోన్లు, పెర్ఫ్యూమ్లను సేకరించేందుకు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం వినిపించింది.
ఈ నౌక ప్రమాదంపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం స్పందించింది. నౌక అనుమతి లేని, ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తూ సముద్రపు మైన్‌ను ఢీకొట్టిందని, దీంతో మంటలు చెలరేగి మునిగిపోయిందని ఆరోపించింది. అయితే ఈ వాదనకు సంబంధించిన స్వతంత్ర నిర్ధారణ వివరాలు అందుబాటులో లేవు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి నుంచి ఇరాన్ అనేక నౌకలపై దాడులు చేసినప్పటికీ, అవి మునిగిపోయిన ఘటనలు తక్కువగా నమోదయ్యాయి. జీఎఫ్ఎస్ ప్రైడ్ మునిగిపోవడానికి ముందు 24 గంటల్లో మరో నౌక కూడా మునిగిపోయినట్లు సమాచారం. అంతకుముందు సెప్టెంబర్ 23న ఆంటిగ్వా, బార్బుడా జెండాతో ప్రయాణించిన కేప్ డావో నౌక కూడా సముద్రంలో మునిగిపోయింది.
హార్ముజ్ జలసంధి పరిసరాల్లో నౌకలపై దాడులు ఇటీవలి రోజుల్లో పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. సముద్రంలో కొట్టుకువస్తున్న కంటైనర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఐఆర్జీసీ స్థానిక జాలర్లను హెచ్చరించింది. మరోవైపు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన సైనిక బలగాలను ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని ఇరాన్ శుక్రవారం స్పష్టం చేసింది. అమెరికా వెళ్లిపోతే ప్రాంతీయ దేశాల భాగస్వామ్యంతో సమష్టి భద్రత ఏర్పడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఇరాన్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమినియా పేర్కొన్నారు. అమెరికా వెళ్లకపోతే బలగాలను బయటకు పంపిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిబంధనలు ఉల్లంఘించిన ట్యాంకర్లో మంటలు చెలరేగినట్లు ఇరాన్ నౌకాదళం ఆరోపించింది. మరోవైపు యెమెన్‌లోని తైజ్ ప్రాంతం చుట్టూ ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు దాడులను తీవ్రతరం చేశారు. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రియాద్‌తో పాటు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపాయి. ఎర్ర సముద్రం వైపు వెళ్తున్న ఒక బాలిస్టిక్ క్షిపణిని, రెండు క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేశామని, మరో మూడు డ్రోన్లను అడ్డుకున్నామని వెల్లడించాయి.