పాక్ ను ఓడించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటా: ఇంగ్లండ్ బాక్సర్

ప్రపంచకప్‌లో భారత్ తో పాకిస్థాన్‌ ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రముఖ బ్రిటిష్‌ బాక్సర్ అమిర్‌ ఖాన్ తెలిపాడు. జులై 12న సౌదీ అరేబియాలో జరగబోయే బాక్సింగ్‌ మ్యాచ్‌లో భారత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ను ఓడిస్తానని చెప్పాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ బాక్సర్‌ అమిర్‌ఖాన్‌ ట్విటర్‌లో పైవిధంగా స్పందించాడు. దీనికి నీరజ్‌ గోయత్‌ తనదైన శైలిలో ధీటుగా బదులిచ్చాడు. ‘అలాగే కలలోనే ఉండు అమిర్‌.. నువ్వు నా విజయాన్ని, భారత గెలుపుని వీక్షిస్తావు’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టాడు.

అయితే పాక్ సాధించలేనిది తాను సాధించి చూపుతానంటూ పాక్ సంతతికి చెందిన బ్రిటిష్ బాక్సర్ అమిర్ ఖాన్ శపథం చేస్తున్నాడు. జూలై 12వ తేదీన సౌదీ అరేబియాలో జరగనున్న బాక్సింగ్ పోటీలో తాను భారత బాక్సర్ నీరజ్ గోయత్ తో పోటీ పడనున్నట్లు అమీర్ తెలిపాడు. ఇందులో భారత బాక్సర్ ను ఓడించడం ద్వారా ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో పాక్ కు ఎదురయిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఓ ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఉద్దేశించి ఆమిర్‌ మరో ట్వీట్‌ చేశాడు. ’ఫిట్‌నెస్‌ ఎలా మెరుగుపరుచుకోవాలో పాక్‌ క్రికెట్‌ జట్టుకు నేను సూచనలు చేస్తా. ఆహారం, డైట్‌ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో వివరిస్తా. పాక్‌ జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారు బలంగా మారి పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి’ అని సూచించాడు. ఆమిర్‌ పుట్టి పెరిగింది మాంచెస్టర్‌లోనే అయినా అతడి మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. దీంతో అతడు పాక్‌ జట్టుకు మద్దతుగా నిలిచాడని తెలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్‌ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో వెనుకంజలో ఉంది. ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు గెలిస్తే తప్ప ఆ జట్టుకు సెమీస్‌కి చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ కెప్టెన్సీ, ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *