జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో పదేళ్లుగా నివసిస్తున్న భారతీయ టెక్కీ అంకిత్ పురోహిత్ అక్కడి జీవన ప్రమాణాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్వచ్ఛమైన గాలి, సమయపాలనతో నడిచే రవాణా వ్యవస్థ, న్యాయమైన ఉద్యోగ విధానాలు, మెరుగైన ప్రజా సేవలు జపాన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జపాన్ జీవనశైలిపై చర్చకు దారితీసింది.
ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది అనగానే అందరూ టక్కున చెప్పే పేరు జపాన్. అది జపాన్ సాంస్కృతిక గుర్తింపులో ఒకటిగా మారిపోయింది. జపాన్ అనగానే మరికొందరికి బుల్లెట్ రైళ్లే గుర్తొస్తాయి. అయితే పర్యాటకానికే కాకుండా రోజువారీ జీవనానికి, ఉద్యోగాలకు కూడా జపాన్ అద్భుత దేశమని ఐఐఎం కాశీపూర్ పూర్వ విద్యార్థి, భారతీయ టెక్కీ అంకిత్ పురోహిత్ అంటున్నాడు. గత పదేళ్లుగా జపాన్‌లోనే స్థిరపడిన అతను.. అక్కడి జీవన నాణ్యత ఎందుకు టాప్‌లో ఉంటుందో వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంకిత్ పంచుకున్న వివరాల ప్రకారం.. జపాన్‌లో వాయు కాలుష్య సూచీ ఎప్పుడూ 50 కంటే తక్కువగానే ఉంటుంది. కాలుష్య కోరల్లో చిక్కుకునే భారతీయులకు ఈ స్వచ్ఛమైన గాలి గొప్ప వరమని అన్నాడు. అలాగే అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ చాలా కచ్చితత్వంతో పనిచేస్తుందనీ ఆఫీస్‌కు లేట్ అవుతుందనే భయమే ఉండదని చెప్పాడు. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కూడా ప్రజలంతా ఎంతో నిశ్శబ్దంగా, నెమ్మదిగా మాట్లాడుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉంటారని అంకిత్ వివరించాడు. ఇక జపాన్ అనగానే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ప్రచారం ఉంది. కానీ అంకిత్ మాత్రం దాన్ని కొట్టిపారేశాడు. అక్కడ ఆఫీస్‌కు వెళ్లడం అస్సలు ఒత్తిడిగా అనిపించదని, ఉద్యోగులు అదనంగా పనిచేసే ప్రతి గంటకు, అలాగే సెలవు రోజుల్లో పనిచేస్తే దానికి తగినట్లుగా కంపెనీలు అదనపు వేతనాన్ని చెల్లిస్తాయని తెలిపాడు. జపాన్‌లోని కొన్ని ప్రాంతాలు రాత్రి సమయంలో కూడా జనాలతో కిటకిటలాడుతుంటాయని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిబుయా క్రాసింగ్ అర్ధరాత్రి కూడా వేలాదిమందితో సందడిగా ఉంటుందనీ చెప్పుకొచ్చాడు. ఇక సమయంతో పనిలేకుండా తెల్లవార్లూ ఫుడ్ స్టోర్లు సహా ఇతర దుకాణాలు తెరిచే ఉంటాయనీ టెక్నాలజీ, గేమింగ్, యానిమేషన్ స్టోర్లు అక్కడి కుర్రాళ్లతో రాత్రివేళ బిజీగా ఉంటాయన్నాడు. అంతేకాకుండా వేలాది పబ్‌లు, క్లబ్‌లు, రోబో రెస్టారెంట్లు 24 గంటలూ తెరిచే ఉంటాయనీ తెలిపాడు. మనం కట్టే పన్నులకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి అత్యుత్తమ వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ప్రజా భద్రత, పౌర సేవలు అందుతాయని అంకిత్ చెప్పుకొచ్చాడు. స్వచ్ఛమైన పర్యావరణం, నమ్మకమైన రవాణా, న్యాయమైన పని విధానాలు, క్వాలిటీతో ఉండే ప్రజా సేవలు జపాన్‌ను ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు గల దేశంగా నిలబెట్టాయని ఆ భారతీయ టెక్కీ స్పష్టం చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్..!
