వీధికుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు
సాధారణ వీధికుక్కగా కనిపించే కారామెల్ డాగ్ ఇప్పుడు బ్రెజిల్-మెక్సికో మధ్య సాంస్కృతిక వివాదానికి కేంద్రబిందువైంది. ఈ కుక్క తమ దేశ సంస్కృతికి ప్రతీక అని ఇరు దేశాల ప్రజలు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ యుద్ధానికి దారి తీసిన ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక సాధారణ కుక్కను జాతీయ గర్వానికి చిహ్నంగా మార్చింది.
సాధారణంగా దేశాల మధ్య సరిహద్దులు, వాణిజ్యం, రాజకీయ అంశాలపై వివాదాలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక విచిత్రమైన వివాదం తెరపైకి వచ్చింది. అది ఏంటంటే… ఒక సాధారణ వీధికుక్క మూలాల గురించి ఏకంగా రెండు దేశాలే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం లాటిన్ అమెరికాలోని రెండు ప్రధాన దేశాలు బ్రెజిల్, మెక్సికో మధ్య “కారామెల్ ” అనే వీధికుక్క జాతి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కుక్క అసలు ఏ దేశానికి చెందినది అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. కారామెల్ డాగ్ బంగారు-గోధుమ రంగులో సాధారణ వీధికుక్క. బ్రెజిల్‌లో ఈ కుక్కలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి వీధుల్లో, కాలనీల్లో, గ్రామాల్లో ఇవి విస్తృతంగా కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ కుక్కలు బ్రెజిల్ ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగమయ్యాయి. సోషల్ మీడియా యుగంలో కారామెల్ డాగ్ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం ఈ కుక్క బ్రెజిల్ సంస్కృతికి ప్రతీకగా మారింది. అయితే ఇటీవల మెక్సికోలో కూడా ఈ తరహా కుక్కలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే చర్చ మొదలైంది. కొందరు వాటిని మెక్సికన్ సంస్కృతికి ప్రతీకగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇదే బ్రెజిల్ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. బ్రెజిలియన్ల వాదన ప్రకారం, కారామెల్ డాగ్ అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. అది బ్రెజిలియన్ల జీవనశైలికి, సంస్కృతికి, భావోద్వేగాలకు ప్రతిబింబం. అలాంటి తమ గుర్తింపును మరో దేశం స్వంతం చేసుకోవడంపై వారిప్పుడు మండిపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. బ్రెజిల్, మెక్సికోకు చెందిన వేలాది మంది నెటిజన్లు తమ తమ వాదనలను వినిపిస్తున్నారు. దీంతో CarameloDog, BrazilianSymbol వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఇది సరదా వివాదమని భావిస్తుంటే, మరికొందరు దీనిని సాంస్కృతిక గుర్తింపుకు సంబంధించిన సీరియస్ అంశంగా చూస్తున్నారు. దీంతో ఈ విషయం అంతర్జాతీయ మీడియా దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒక సాధారణ వీధికుక్క అంత పెద్ద చర్చకు కారణమవుతుందని ఎవరైనా ఊహించారా? వీధి కుక్క కారామెల్ డాగ్, ఇప్పుడు రెండు దేశాల మధ్య కొట్లాటకు కేంద్రబిందువుగా మారింది. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… కారామెల్ డాగ్ ఇప్పుడు కేవలం కుక్క కాదు, కోట్లాది మంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఒక సాంస్కృతిక గుర్తింపు. కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళితే.. పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ నుంచి బ్రెజిల్‌కు వలస వచ్చిన ప్రజలు తమ పెంపుడు కుక్కలను వెంట తీసుకువచ్చారు. కాలక్రమేణా ఆ కుక్కలు.. ఇతర జాతి కుక్కలతో జతకట్టడంతో ఈ కారామెల్ జాతి ఏర్పడిందని చెబుతారు. వందలాది రకాల శునక జాతుల లక్షణాలు కలగలిసి నేటి కారామెల్ డాగ్ తమకు మాత్రమే చెందిన ప్రత్యేక గుర్తింపుగా బ్రెజిల్ ప్రజలు భావిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే ఈ శునకాలు ప్రజలతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా వీటి ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కారామెల్ డాగ్‌లపై ప్రజలకు ఉన్న అభిమానానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం బ్రెజిల్ కరెన్సీ నోట్లపై ఈ కుక్క చిత్రాన్ని ముద్రించాలని కోరుతూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వేలాది మంది ప్రజలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా, పిటిషన్‌కు 50 వేలకుపైగా సంతకాలు రావడం దేశంలో కారామెల్ డాగ్‌కు ఉన్న ఆదరణను స్పష్టంగా చూపించింది. ఒక సాధారణ వీధికుక్కగా కనిపించిన కారామెల్, నేడు బ్రెజిల్ ప్రజల గర్వకారణంగా, వారి సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక చిహ్నంగా మారింది. 2019లో బ్రెజిల్‌లో “కారామెల్” కుక్క అనూహ్యంగా ఇంటర్నెట్ స్టార్‌గా మారింది. సోషల్ మీడియాలో కుక్కకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా కారామెల్ చర్చే నడిచేది. సరదా వీడియోలతో కారామెలో కుక్క బ్రెజిలియన్ల హృదయాలను గెలుచుకుంది. కొద్ది కాలంలోనే అది సాధారణ వీధి కుక్క స్థాయి నుంచి సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎదిగింది. కారమెల్ ను బ్రెజిల్ కరెన్సీ నోటుపై ముద్రించాలని ప్రజలు డిమాండ్ చేసారు. దేశంలోని 10 రియాస్ నోటుపై ఉన్న పక్షి చిత్రానికి బదులుగా కారామెల్ బొమ్మను ముద్రించాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. ఆ ప్రతిపాదనకు 50 వేల మంది మద్దతు తెలిపారు. ఆ ఉత్సాహం అక్కడితో ఆగలేదు. 200 రియాస్ నోటుపై కారామెలో చిత్రాన్ని ముద్రించాలని 2020లో మరో ఉద్యమం మొదలైంది. రెండో పిటిషన్‌కు మరింత ఎక్కువ మంది మద్దతు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కారామెలో చిత్రం డాగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కారామెల్ డాగ్ వివాదం అసలు మలుపు తిరిగింది మెక్సికో తీసుకున్న ఒక కీలక నిర్ణయంతో. మెక్సికోకు చెందిన ప్రభుత్వ పర్యావరణ సంస్థ చివావా ప్రత్యేక జాతి శునకంతో పాటు కారామెల్ తమ దేశ సంస్కృతిలో భాగమని పేర్కొంటూ, దానిని అధికారికంగా “నాలుగో జాతీయ చిహ్నం”గా గుర్తించినట్లు ప్రకటించింది. ఆ ఒక్క ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే బ్రెజిల్ ప్రజలు తీవ్రంగా స్పందించారు. కారామెల్ డాగ్ అనేది దశాబ్దాలుగా తమ దేశ గుర్తింపులో భాగంగా ఉందని, దానికి మెక్సికో చరిత్రతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. తమ సాంస్కృతిక ప్రతీకను మరో దేశం సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది బ్రెజిలియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు చేస్తూ, “కారామెల్ డాగ్ బ్రెజిల్‌దే” అంటూ ప్రచారం చేస్తున్నారు. తమ దేశ వారసత్వానికి ప్రతీకగా మారిన ఈ కుక్కను ఎవ్వరూ తమ నుంచి వేరు చేయలేరని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మెక్సికోకు చెందిన నెటిజన్లు కూడా తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. దీంతో రెండు దేశాల ప్రజల మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైన “హ్యాష్‌ట్యాగ్ వార్” కొనసాగుతోంది. సాధారణంగా కనిపించే ఒక వీధికుక్క ఇప్పుడు రెండు దేశాల మధ్య ప్రతిష్టాత్మక అంశంగా మారడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఒక కుక్క జాతి గుర్తింపు కోసం రెండు దేశాల ప్రజలు సోషల్ మీడియాలో పోరాడుతున్న ఈ అరుదైన ఘటనను ప్రపంచ మీడియా ప్రత్యేక కథనాలుగా ప్రచురిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 అంతస్తులు.. 2,200 పడకలు.. దేశంలోనే టాప్ సర్కారు హాస్పిటల్ రెడీ
ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ!
చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ
‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్..
TTD: రికార్డ్ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..
