ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ' పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కేవలం రిబ్బన్ కట్ చేయడానికే పరిమితం కాలేదు. ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టి, డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును నడిపారు. పట్టణంలోని జ్యోతిరావు పూలే సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడపడం చూసి స్థానికులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
బస్సు ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దివ్యాంగులతో ముచ్చటించారు. వారికి స్వయంగా ఉచిత ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన .. దివ్యాంగుల సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 11 లక్షల మందికి పైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని, వారి ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.
Follow Us