పెళ్లయిన ఏడాదికే గల్ఫ్ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై స్వదేశానికి
పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్ళిన ఒక వలస కార్మికుడి జీవితం నాలుగు దశాబ్దాల పాటు అక్కడే బందీ అయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బోట్ల చంద్రయ్య 1982లో, పెళ్లైన ఏడాదికే గల్ఫ్‌కు వెళ్లాడు. పేదరికం నుండి కుటుంబాన్ని గట్టెక్కించాలనే ఆశతో కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి వెళ్ళిన ఆయన జీవితం ఎడారిలోనే శాశ్వతంగా బంధీ అవుతుందని ఊహించలేదు.
అక్షరాలా 44 ఏళ్లు గడిచినా చంద్రయ్య ఒక్కసారి కూడా స్వగ్రామానికి రాలేదు. ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులు లేకపోవడం, అటు గల్ఫ్‌లో పాస్‌పోర్ట్, వీసా గడువు తీరిపోవడంతోపాటు వాటిని రెన్యువల్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆయన స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగించాడు. చివరికి అనారోగ్యంతో అక్కడే కన్నుమూశాడు. చనిపోయిన తర్వాత అతని వద్ద ఉన్న పాత కాగితాలను పరిశీలించిన అధికారులు, సామాజిక కార్యకర్తల సాయంతో చంద్రయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ వార్త చెల్లాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 44 ఏళ్లుగా భర్త తిరిగి వస్తాడని ఎదురుచూసిన భార్య లక్ష్మి, ఇప్పుడు శవమై వస్తున్నారని తెలిసి గుండెలవిసేలా రోదించింది. వలస కార్మికుల దుర్భర పరిస్థితులకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
సౌత్ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్