స్పైడర్‌ మ్యాన్‌లా స్టంట్‌ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..

Updated on: Sep 06, 2026 | 11:19 AM

సోషల్‌ మీడియా రీల్స్‌, సూపర్‌హీరో సినిమాల్లోని స్టంట్లను అనుకరించే పిల్లలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయాన్ని ఓ వైరల్‌ వీడియో మరోసారి గుర్తుచేసింది. స్పైడర్‌మ్యాన్‌ కాస్ట్యూమ్‌ వేసుకున్న ఓ చిన్నారి ఇంట్లో ఫర్నిచర్‌పై నుంచి దూకే ప్రయత్నంలో కిందపడిపోయాడు. కడుపు, ఛాతీ నేలకు బలంగా తగలడంతో ఊపిరి ఆడటం లేదంటూ రోదించాడు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన తల్లిదండ్రులకు హెచ్చరికగా మారింది.

సోషల్ మీడియాలో రీల్స్, స్టంట్స్‌ మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే ఓ స్టంట్ చేయడానికి ప్రయత్నించిన చిన్న బాలుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తనను తాను నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడి నుంచి కిందకు దూకుతూ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ చిన్నారి సరిగా దూకకపోవడంతో నేరుగా అతడి కడుపు, ఛాతీ భాగం నేలకు బలంగా తగిలేలా కిందపడిపోయాడు. ఆ దెబ్బ తీవ్రతకు క్షణాల్లో బాలుడికి ఊపిరి ఆడటం కష్టంగా మారింది. భయాందోళనకు గురైన ఆ చిన్నారి రోదిస్తూ ‘అమ్మా! నాకు ఊపిరి ఆడటంలేదు’ అని గట్టిగా కేకలు వేశాడు. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఘటన పిల్లలను పెంచే విధానంపై, సోషల్ మీడియా వాడకంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సూపర్ హీరో సినిమాలు, రీల్స్ చూసే పిల్లలు వాటిని నిజమని నమ్మి ఇంట్లోనే అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమాలు, వీడియోల్లో వచ్చే స్టంట్లు గ్రాఫిక్స్ అని, నిజ జీవితంలో చేస్తే ప్రాణాలకే ప్రమాదమని పిల్లలకు వివరించాలి. అదృష్టవశాత్తూ ఆ బాలుడికి పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ వీడియో తల్లిదండ్రులకు కనువిప్పులాంటిది. పిల్లల భద్రత కోసం వారి ప్రవర్తనపై నిత్యం కన్నేసి ఉంచడం ఎంతో అవసరం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పగలు ఆర్‌ఎంపీ డాక్టర్‌.. రాత్రయితే..

Loading...
Unable to load recommendations.
Follow Us