ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలోకి నాగుపాము ప్రవేశించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నంలో జనావాసాల్లోకి పాములు రావడం ఈ మధ్య కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-1 లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న ఒక భారీ నాగుపామును చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. నెమ్మదిగా అది పొదల్లోకి వెళ్ళిపోతుందిలే అని అందరూ భావించారు, కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పాము నేరుగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించింది. స్వామివారి గర్భగుడిలో నాగన్నను చూసిన ప్రధాన అర్చకులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలయంలోని భక్తులను సురక్షిత ప్రాంతానికి పంపి, స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కిరణ్ తన బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో ఉన్నది అత్యంత విషపూరితమైన ‘ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రా’అని ఆయన గుర్తించారు. ఆలయ వాతావరణంలో పాముకు ఎలాంటి హాని జరగకుండా, భక్తులకు ముప్పు వాటిల్లకుండా స్నేక్ క్యాచర్ కిరణ్ అత్యంత చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకున్నారు. పాము సురక్షితంగా పట్టుబడడంతో ఆలయ అర్చకులు, భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలకు తెగించి పామును రెస్క్యూ చేసిన కిరణ్‌ను అభినందించారు. అనంతరం ఆ పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. సరికొత్త శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!
