ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

Updated on: Apr 11, 2026 | 6:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా మన్నెం కల్పన చరిత్ర సృష్టించారు. సాధారణ టీచర్‌గా ఉన్న ఆమె సమాజ సేవకై అత్యవసర సేవల వైపు అడుగులేశారు. 42 ఏళ్ల వయసులో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సాధించి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రాణదాతగా నిలుస్తున్నారు. ఆమె సాహసం, సేవాగుణం నేటి తరానికి ఆదర్శం, మహిళా సాధికారతకు నిదర్శనం.

అంబులెన్స్ సైరన్ వినిపించిందంటే.. అక్కడ కాలంతో యుద్ధం జరుగుతోందని అర్థం. ఆ స్టీరింగ్ వెనుక సాధారణంగా పురుషులే కనిపిస్తారు. కానీ, మృత్యువు అంచున ఉన్న ప్రాణాలను కాపాడడానికి ఒక మహిళ ముందుకొచ్చింది. ఆమే మన్నెం కల్పన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ వాహనాలను నడిపే లైసెన్స్ పొంది, అంబులెన్స్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కల్పన. డిగ్రీ పూర్తి చేసి, టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెబుతూ స్థిరపడ్డారు. అయితే, ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం పరిమితం కాకూడదని, సమాజానికి ఏదో ఒక రూపంలో నేరుగా సేవ చేయాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ సంకల్పమే ఆమెను అత్యవసర సేవల వైపు నడిపించింది. ఏపీఎస్‌ఆర్టీసీ నిర్వహించిన డ్రైవింగ్ శిక్షణలో 15 మంది పురుషులతో పోటీ పడి నిలబడ్డ ఏకైక మహిళ కల్పన. 42 ఏళ్ల వయసులో “నీవల్ల కాదు” అన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సాధించారు. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్లను దాటుకుంటూ, రోగిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలో కల్పన చూపిస్తున్న తెగువ అమోఘం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నైట్ షిఫ్టుల్లో కూడా వందల కిలోమీటర్లు అంబులెన్స్‌ను నడుపుతూ రోగులకు అండగా నిలుస్తున్నారు. వెనుక రోగి ప్రాణభయంతో ఉంటే, బంధువుల ఆర్తనాదాల మధ్య గుండె నిబ్బరంతో వాహనాన్ని గమ్యస్థానానికి చేరుస్తున్నారు. సాహసం చేయాలే కానీ, మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు అని కల్పన నిరూపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో ఆమె చూపిస్తున్న తెగువ, సేవాగుణం నేటి తరం ఆడపిల్లలకు ఒక పాఠం. ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా నిలుస్తున్న మన్నెం కల్పన నిజమైన ‘రోడ్ వారియర్’.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

Follow Us