తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !

Updated on: Jun 25, 2026 | 4:05 PM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదుల పేరుతో 60 మంది భక్తులను దళారి నెమల శ్రీనివాసులు మోసం చేశాడు. నకిలీ సిఫారసు లేఖలతో రూ. 4.22 లక్షలు కాజేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక మార్గాలను మాత్రమే ఉపయోగించాలని టీటీడీ, పోలీసులు సూచిస్తున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దళారీల దోపిడీ మరోసారి వెలుగులోకి వచ్చింది. సుప్రభాత సేవ టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని నమ్మబలికి 60 మంది భక్తులకు టోకరా వేశారు కేటుగాళ్లు. టీటీడీ ఉద్యోగుల పేర్లు, నకిలీ సిఫారసు లేఖలతో నెమల శ్రీనివాసులు అనే దళారి ఏకంగా 4.22 లక్షలు కాజేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాస రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నెమల శ్రీనివాసులు తనకు టీటీడీ ఉద్యోగులతో పరిచయాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కోటా కింద టికెట్లు, వసతి కల్పిస్తానని భక్తులను నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద రూ. 6,000 చొప్పున దర్శన టికెట్లకు, వసతి గదులకు కలిపి మొత్తం రూ. 4.22 లక్షలు వసూలు చేశాడు. దర్శనం రోజు నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు మోసం బయటపడింది. దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా కౌంటర్లను మాత్రమే వినియోగించాలని తిరుపతి జిల్లా పోలీసులు భక్తులకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us