Tirumala: తిరుమలలో ఆగని రాజకీయ మంటలు

Updated on: Aug 29, 2025 | 9:22 AM

తిరుమలలో బీఆర్ నాయుడు వర్సెస్ భూమన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల పవిత్రత, భూ అక్రమాలు అంటూ ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు పర్సనల్‌గా వెళ్లింది. ఎవరేం చేశారో తేలుద్దామంటూ సవాల్‌ విసిరారు భూమన. అయితే భూమన హయాంలో ఏం జరిగిందో తనకు తెలుసంటున్నారు టీటీడీ మాజీ సభ్యులు ఓవీ రమణ.

తిరుమలలో రాజకీయ మంటలు ఇప్పట్లో ఆగేలా లేవు. టీటీడీ ఛైర్మన్, మాజీ ఛైర్మన్‌ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గజదొంగయిన భూమనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలన్న బీఆర్ నాయుడు విమర్శలు కౌంటర్ ఇచ్చారు భూమన. బీఆర్ టిటిడి చైర్మన్ కావడం ఆయనకు అదృష్టం, ‌కోట్లాది మంది హిందువుల దురదృష్టమన్నారు. తిరుమలలో గుడిలో వేదమంత్రాల వినపడుతుంటే గుడి బయట చైర్మన్ బూతులు వినాల్సి వస్తోందని విమర్శించారు.

టిటిడి చరిత్రలో బిఆర్ నాయుడు పాలన చీకటి యుగమన్నారు భూమన. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఆయన తీరువల్లే టీటీడీ పవిత్రత దెబ్బతింటుందన్నారు. బిఆర్ నాయుడ్ని భక్తులే తరిమితరిమి కొడతారన్నారు భూమన.

మరోవైపు భూమనపై తీవ్ర విమర్శలు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ. భూమన టీటీడీని దోచేసిన ఘనుడని, కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అన్నారు. బిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్ళిళ్లు చేయించారని విమర్శించారు. విశాఖలో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు రూ 12వేలు ఖర్చు చేశారని ఆరోపించారు ఓవీ రమణ. టిటిడి ఛైర్మన్‌గా రెండు సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా ప్రశ్నించారు.

బీఆర్ నాయుడిని భూమన టార్గెట్ చేస్తే.. భూమనని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ టార్గెట్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి.. ఇవాళ హైందవ ధర్మం అంటూ నీతులు చెప్పొద్దని భూమనకు కౌంటర్‌ ఇచ్చారు.