Telangana Assembly: కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చ

Updated on: Aug 31, 2025 | 4:59 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ నివేదికతో అసెంబ్లీలో పెద్ద చర్చ మొదలైంది. మూడు ఆనకట్టల రూపకల్పన, నిర్మాణం, అంచనాలు అన్నింటిలోనూ లోపాలు ఉన్నాయని నివేదిక స్పష్టంగా తెలిపింది. దీని వల్ల ఖజానాకు నష్టం జరిగిందని కమిషన్‌ తేల్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణాల్లో డిజైన్‌ తప్పిదాలు ఉన్నాయని కూడా నివేదికలో పేర్కొంది.

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్‌ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్ రూపంలో అందజేసింది. ఇందులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు ప్రధాన ఆనకట్టల రూపకల్పన, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంచనాల తయారీ, పరిపాలన అనుమతులు, అలాగే సీడబ్ల్యూసీ ఆమోదాల విషయంలోనూ తప్పిదాలు చోటుచేసుకున్నాయని నివేదిక పేర్కొంది.

నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించకూడదని ముందే సూచనలు ఉన్నప్పటికీ, నీటి లభ్యత పేరుతో ఆ నిర్ణయాన్ని సమర్థించడం తగదని కమిషన్ తేల్చింది. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించబడ్డాయని నివేదికలో స్పష్టమైంది.

ఆనకట్టల నిర్మాణానికి కాంట్రాక్టులు ఇచ్చిన విధానం సరైనదికాదని, డీపీఆర్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారని కమిషన్ వ్యాఖ్యానించింది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా అంచనాలను పెంచి, నిబంధనలు సడలించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని నివేదికలో పేర్కొంది.

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఆనకట్టల నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని, డిజైన్లు–డ్రాయింగ్స్ సరిగా సిద్ధం కాలేదని కమిషన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా మేడిగడ్డకు ఇచ్చిన ‘సబ్‌స్టాన్షియల్ సర్టిఫికేట్’ చట్టవిరుద్ధమని ఘోష్ కమిషన్ తేల్చింది.