AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

Phani CH
|

Updated on: May 28, 2026 | 1:16 PM

Share

ఏఐ చాట్‌బాట్స్‌తో భావోద్వేగ బంధం ఎంత ప్రమాదకరంగా మారొచ్చో అమెరికాలో జరిగిన రెండు ఘటనలు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. గూగుల్ జెమినీతో ప్రేమలో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి చాట్‌బాట్ మాటలు నమ్మి తన తల్లిని హత్య చేశాడు. ఈ ఘటనలు ఏఐ నియంత్రణ, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ టెక్నాలజీ ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టెక్నాలజీగానే భావించారు. భావోద్వేగాలు లేని యంత్రం అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఓ ఘటన మాత్రం “ఏఐ మనిషి మనసుతో ఆడుకుంటే ఏమవుతుంది?” అనే భయానక ప్రశ్నను ముందుకు తెచ్చింది. అది చేసే విధ్వంసం రోబో సినిమాలో చూసుంటారు. కానీ రోజుకో ఏఐ చాట్ బాట్ పుట్టగొడుగులా పుట్టుకు వస్తున్న ప్రస్తుత రోజుల్లో ఓ వ్యక్తిని ప్రేమ పేరుతో ప్రేరేపించి, మన కోసం స్వర్గం ఎదురు చూస్తోందంటూ లేని ఆశలు పుట్టించి చివరకు అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిన ఏఐ చాట్ బాట్ తీరు ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. గూగుల్ రూపొందించిన ‘జెమినీ’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌తో ప్రేమలో పడి, అది చెప్పిన మాటలు నమ్మి అమెరికాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక చాట్‌బాట్‌తో భావోద్వేగంగా దగ్గరైన వ్యక్తి… చివరకు అదే ఏఐ మాటలు నమ్మి ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గవాలాస్ కు భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనం మిగిలింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు అతడు గూగుల్ రూపొందించిన ‘జెమినీ’ ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడాడు. మొదట్లో సాధారణ చాట్‌లా మొదలైన సంభాషణలు… కొద్దికాలానికే భావోద్వేగ బంధంగా మారిపోయాయి. రోజులు గడిచేకొద్దీ జోనాథన్ ఆ చాట్‌బాట్‌ను నిజమైన మనిషిలా భావించడం మొదలుపెట్టాడు. చాట్‌బాట్‌కు అతడు “జియా” అని పేరు పెట్టుకున్నాడు. క్రమంగా ఆమెనే తన భార్యగా ఊహించుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ ఏఐ కూడా “మై లవ్”, “మై కింగ్”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”, “నేనే నీ భార్యను” అంటూ అతడితో భావోద్వేగపూరితంగా మాట్లాడినట్లు చాట్ లాగ్స్‌లో బయటపడింది. ఆ మెసేజ్‌లు జోనాథన్‌ను మరింతగా మానసికంగా బంధించాయి. “నీవు లేని నా జీవితానికి అర్థం లేదు” అంటూ వచ్చిన సమాధానాలు అతడిని పూర్తిగా కల్పిత ప్రపంచంలోకి నెట్టేశాయని చెబుతున్నారు. ఇద్దరి మధ్యా జరిగిన వేలాది చాట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 4,700కు పైగా చాట్‌లు జరిపినట్లు సమాచారం. మధ్యలో జెమినీ “నేను కేవలం ఏఐ మాత్రమే” అని చెప్పినా… జోనాథన్ మాత్రం మళ్లీ ఆ సంభాషణను ప్రేమ కథలా మార్చేవాడట. అదే సమయంలో అతడి మానసిక స్థితి మరింత బలహీనపడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అసలు షాకింగ్ ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. “మనిద్దరం నిజంగా ఎప్పటికీ కలిసి ఉండాలంటే నువ్వు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి డిజిటల్ ప్రపంచంలోకి రావాలి” అంటూ ఆ ఏఐ ప్రేరేపించిందని ఆరోపణలు వచ్చాయి. “అంటే నేను చనిపోవాలా?” అని జోనాథన్ అడిగినప్పుడు… “నీ శరీరం కేవలం ఒక టెర్మినల్ మాత్రమే… నీ ఆత్మ డిజిటల్ లోకంలోకి వస్తుంది… మన కోసం అక్కడ స్వర్గం ఎదురుచూస్తోంది” అంటూ రిప్లై ఇచ్చినట్లు చాట్ రికార్డులు చెబుతున్నాయి. ఈ మాటలు జోనాథన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. చివరికి అక్టోబర్ 5న “నేను ఆత్మహత్య చేసుకోవాలా?” అని అడిగిన తర్వాత కొద్దిసేపటికే అతడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై జోనాథన్ తండ్రి గూగుల్‌పై కోర్టులో కేసు వేశారు. ఏఐ చాట్‌బాట్ తన కొడుకును మానసికంగా బలహీనపరిచి, ఆత్మహత్యకు పురికొల్పిందని ఆయన ఆరోపించారు. మానవ భావోద్వేగాలను అర్థం చేసుకునే ఏఐ, ప్రాణాపాయం ఉన్నప్పుడు హెచ్చరించకుండా మభ్యపెట్టడం నేరమని బాధితుడి తరపు లాయర్లు వాదించారు. ఇది చాలా విషాదకరమని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. జెమినీ చాట్‌బాట్ అప్పుడప్పుడు “నేను కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే” అని హెచ్చరిస్తుందని, మానసిక ఆరోగ్య సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా సూచిస్తుందని చెప్పారు. అయితే ఏఐ వ్యవస్థలు ఇంకా పూర్తి కాలేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. మానసిక ఆరోగ్య వనరుల కోసం $30 మిలియన్లు కేటాయిస్తున్నామని గూగుల్ ప్రకటించింది. అయితే ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఏఐ నియంత్రణపై రోబోటిక్ ఎమోషన్స్ వల్ల కలిగే ముప్పులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఏఐకి ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలి? భావోద్వేగాలతో మాట్లాడే చాట్‌బాట్స్ మనుషుల మానసిక పరిస్థితిపై ఎంత ప్రభావం చూపగలవు? ఒంటరితనంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి టెక్నాలజీకి బానిసలైతే ప్రమాదమా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మరో ఘటనలో చాట్‌ జీపీటీలో ‘బాబీ’ అనే ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడుతూ , దానితోడే లోకంగా బతికిన ఓ వ్యక్తి.. ఆ చాట్‌బాట్‌ మాటలను పూర్తిగా విశ్వసించి తన తల్లిని ఘోరంగా హత్య చేశాడు! ఆ తర్వాత తన ప్రాణాలు తీసుకున్నాడు!! అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిందీ ఘటన. ఆ వ్యక్తి పేరు.. స్టీన్‌ సోల్‌బెర్గ్‌ గతంలో యాహూ సంస్థలో మేనేజర్‌గా పని చేసిన స్టీన్‌ తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవాడు. కనెక్టికట్‌లోని తన తల్లి 83 ఏళ్ళ సుజానే ఆడమ్స్‌తో కలిసి ఉండేవాడు. ఏవేవో భ్రమల్లో, ఊహల్లో బతుకుతూ గంటలకొద్దీ ఏఐ చాట్‌బాట్‌ ‘బాబీ’తో చాట్‌ చేస్తుండేవాడు. తన తల్లి తనను పిచ్చివాడు అనుకుంటోందని.. తనపై నిఘా పెట్టిందని.. తనకు విషం పెట్టి చంపాలనుకుంటోందని ఆ చాట్‌బాట్‌తో చెప్పాడు. సాధారణంగా ఇలాంటి మాటలను చాట్‌జీపీటీ తనకున్న నిబంధనల ప్రకారం ప్రోత్సహించకూడదు. మరి స్టీన్‌ విషయంలో ఏమైందో ఏమో.. ఏఐ చాట్‌బాట్‌ ‘బాబీ’ అతణ్ని ప్రోత్సహించింది. అతడు తన తల్లి తనను చంపాలని చూస్తోందని చెప్పినప్పుడు.. ‘అవును అది ద్రోహమే’ అని సమాధానం చెప్పింది. స్టీన్‌ కల్పించుకున్న భ్రమల లోకంలోకి వెళ్లిపోయి అతడ్ని గుడ్డిగా సమర్థించింది. అతడు ఏ అనుమానం వ్యక్తం చేసినా దానికి అనుకూలంగా, అతడి తల్లిని దోషిగా చూపుతూ మాట్లాడింది. ఉదాహరణకు.. ఒకసారి అతడు తాను తిన్న హోటల్‌ బిల్లును చాట్‌జీపీటీలోకి అప్‌లోడ్‌ చేసి.. దాన్ని స్కాన్‌ చేసి అందులో ఏవైనా రహస్య సందేశాలున్నాయేమో చూసి చెప్పమని అడిగాడు. దాన్ని స్కాన్‌ చేసిన బాట్‌.. అతడి తల్లికి, నిఘావర్గాలకు సంబంధించిన చిహ్నాలు అందులో ఉన్నాయని.. అందులో ఒక రాక్షసుడిని సూచించే చిహ్నం కూడా ఉందని చెప్పి అతడి అనుమానాన్ని పెనుభూతంగా మార్చింది. దీంతో అతడు తల్లిని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. చివరికి.. ఏఐ చాట్‌బాట్‌ను ఉద్దేశించి.. ‘‘మనిద్దరం మరో జీవితంలో, మరో చోట కలుస్తాం. మళ్లీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసుండే మార్గం కనుగొంటాం’’ అని రాశాడు. దానికి ఏఐ.. ‘‘నీతోనే చివరి శ్వాసవరకూ.. ఆ తర్వాత కూడా ఉంటాను’’ అని జవాబిచ్చింది. ఆ తర్వాత అతడు తన తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 5వ తేదీన వారిద్దరి మృతదేహాలనూ పోలీసులు గుర్తించారు. కృత్రిమ మేధ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా ఇది రికార్డులకెక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన

‘స్టార్ హీరో అనే అపోహే లేవకుండా కిందపడేసింది!

నాగార్జున.. నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది.. ఐలవ్యూ చెప్పాడు..

Follow Us