ఆకాశానికి చిల్లు పడిందా? వచ్చే మూడు రోజులు ఇళ్లలోనే ఉండండి!
ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు ఊరటనిచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గత కొన్ని వారాలుగా ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఎట్టకేలకు ఒక చల్లని కబురు అందించింది. భానుడి భగభగలకు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన రైతులకు, సామాన్య ప్రజలకు ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా మందకొడిగా సాగిన నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది! అవును, సోమవారం నాడు తెలంగాణ పరిధిలో ఇవి వేగంగా ముందుకు కదిలాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించేందుకు అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ.. వాతావరణంలో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య మార్పుల కారణంగా వాటి గమనం ఒక్కసారిగా మందగించింది. కానీ తాజాగా, రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక బలమైన ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏయే జిల్లాలకు ముప్పు పొంచి ఉంది? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అలాగే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వేడి ప్రదేశాలు ఏవి? అనేది తెలుసుకుందాం. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం వర్షం మాత్రమే కాదు.. వానతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వాతావరణశాఖ అంచనా ప్రకారం మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. గురువారం నాటికి వర్షాల తీవ్రత పరాకాష్టకు చేరనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మినహా తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీని ప్రభావంతో జూన్ 28 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 25, 26 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ సహా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. అయితే ప్రకృతి కరుణిస్తే ఎంత బాగుంటుందో.. కోపిస్తే అంతకంటే ఘోరంగా ఉంటుంది. దీనికి నిదర్శనమే నిర్మల్ జిల్లాలో సోమవారం నాడు చోటుచేసుకున్న భీకర దృశ్యాలు. నిర్మల్ జిల్లా పరిధిలోని కడెం, దస్తురాబాద్, పెంబి మండలాల్లో సోమవారం నాడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలి వేగానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఒక రైస్ మిల్ భవనం ఈ గాలివాన ధాటికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు కానీ, అక్కడ ఉన్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు, నిర్మల్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై పలుచోట్ల వందల సంవత్సరాల నాటి భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కడెం మండల కేంద్రంలోని ధర్మాజీపేట్ గ్రామ సమీపంలో ఒక పెద్ద చెట్టు హైటెన్షన్ కరెంట్ తీగలపై పడటంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఊహించని ప్రమాదంలో ఒక అత్యవసర అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. పరిస్థితిని గమనించిన స్థానిక గ్రామస్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, జెసిబీ సహాయంతో రోడ్డుపై పడిన భారీ వృక్షాలను, కొమ్మలను తొలగించి అంబులెన్స్ వెళ్ళడానికి దారి సుగమం చేశారు. గ్రామస్థుల సమయస్ఫూర్తికి అక్కడి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక భాగ్యనగరం విషయానికి వస్తే.. సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. షా అలీ బండ, చార్మినార్, మదీనా, దబీర్‌పురా, బహదూర్‌పురా, కాలా పత్తర్ తదితర వీధులు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కురిసిన వర్షాల్లో శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే! చందానగర్ 128.0 mm రికార్డు స్థాయి వర్షం పడింది. బీహెచ్‌ఈఎల్ రామచంద్రపురంలో 121.5 mm, లింగంపల్లి 119.8 mm, మియాపూర్114.0 mm, రాజేంద్రనగర్ 111.8 mm, గచ్చిబౌలి ఐటీ హబ్‌లో 103.5 mm వర్షం, హఫీజ్‌పేట్ & సెంట్రల్ యూనివర్సిటీ 85.5 mm వర్షం కురిసింది. వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో డ్రైనేజీలు పొంగిపొర్లి ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈ భారీ వర్షం కారణంగా నగరంలో ఒక్కసారిగా చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మరోవైపు ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని శతాబ్దాల నాటి సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరూతూ గ్రామస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘కప్పతల్లి కావడి’ ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లోని మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పలకు ప్రత్యేక పూజలు చేస్తూ వీధుల్లో ఊరేగారు. ఈ వినూత్న వింత సాంప్రదాయ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. మన పూర్వీకుల నమ్మకాలు, ఆచారాలు ఎంత విభిన్నంగా ఉంటాయో చెప్పడానికి ఈ వేడుక ఒక నిదర్శనం. ఇక తెలంగాణ మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలంగాణ నుంచి మన్నార్ వరకు ద్రోణి విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు మరో 11 జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయి. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ పరిధిలోని కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా చల్లని జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్యాహ్నమంతా తీవ్ర ఎండ తాపానికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలు, సాయంత్రానికి ఒక్కసారిగా మేఘాలు చల్లబడి వర్షం కురవడంతో హమ్మయ్యా అంటూ సేద తీరారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ఉత్తర కోస్తా, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉరుములు, పిడుగులతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున, వాతావరణం అనుకూలించని సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా భారీ హోర్డింగ్ కింద నిలబడవద్దని అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల్లో వర్షాల గురించి మాట్లాడుకున్నాం కదా.. కానీ, ప్రపంచంలోని అనేక దేశాలలో ఎండలు ఇంకా రికార్డులను బద్దలు కొడుతూనే ఉన్నాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లోనైతే.. ఒక్క 10 నిమిషాలు ఎండలో ఉంటే చాలు ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. అలాంటి చోట్లలో మొట్టమొదటి స్థానం ఆఫ్రికాలోని సహారా ఎడారి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 58 డిగ్రీలంటే నమ్మాల్సిందే. అంతేకాదు.. ఇక్కడి భూ ఉపరితల ఉష్ణోగ్రత ఏకంగా 76 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలోని ‘డెత్ వ్యాలీ’ ప్రపంచంలోనే అత్యంత రెండవ వేడి ప్రదేశంగా ఉంది. పేరుకు తగ్గట్టే ఇక్కడి ఎండల్లో తిరిగితే డెత్ కన్ఫార్మ్. ఇక..చైనాలోని తక్లమకాన్ ఎడారి ఉత్తర ప్రాంతంలోని ఫ్లేమింగ్ పర్వతాల్లోనూ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలంటే నమ్మాల్సిందే. వాయువ్య లిబియాలోని జాఫ్రా జిల్లాలోని ‘అల్ అజీజియా’ అనే చిన్న పట్టణంలోనూ 58 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చివరగా..అమెరికా నుండి ఉత్తర మెక్సికో వరకు విస్తరించి ఉన్న సోనోరన్ ఎడారి ప్రాణాంతకమైన ఎండకు ప్రసిద్ధి చెందింది. ఎటు చూసినా ముళ్లతో కూడిన ‘కాక్టస్’ మొక్కలతో నిండి కనిపించే ఈ ఎడారిలో సగటు ఉష్ణోగ్రత 46.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్‌లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి ‘సుపారీ’
అమెరికాలో గడ్డి కోస్తూ లక్షల్లో సంపాదన.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!