కేజీఎఫ్ కాదు బాస్.. అంతకు మించి.. మేడిన్ ఆంధ్ర గోల్డ్ వచ్చేసింది!

Updated on: Jun 29, 2026 | 6:35 PM

ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తి చేసిన ‘మేడిన్ ఆంధ్ర గోల్డ్’ బంగారు బిస్కెట్లు మార్కెట్లోకి రావడం చారిత్రాత్మక ఘట్టంగా మారింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కర్నూలులో విక్రయానికి సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపుకు, దేశీయ బంగారం ఉత్పత్తి విస్తరణకు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

భారతదేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని ఒక అద్భుతమైన, సువర్ణ అధ్యాయం ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ఇన్నాళ్లూ మనం కేజీఎఫ్ సినిమాల్లోనో, లేదా ఎక్కడో కర్ణాటకలోని కోలార్, హట్టి గనుల గురించో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు యావత్ భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసేలా.. మన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నుంచి స్వచ్ఛమైన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది! జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో అత్యంత నాణ్యతతో ఉత్పత్తి చేసిన ‘మేడిన్ ఆంధ్ర గోల్డ్’ ఇప్పుడు కర్నూలు మార్కెట్లో విక్రయానికి సిద్ధమైంది. కొండారెడ్డి బురుజు సాక్షిగా, స్థానిక వ్యాపారులు ఈ బంగారాన్ని విక్రయిస్తుంటే.. రాయలసీమ రత్నాల సీమ అనే మాట అక్షరాలా నిజమైందనిపిస్తోంది! “మన ఇంటికి మన బంగారం” అనే నినాదంతో మార్కెట్లోకి వచ్చిన ఈ గోల్డ్ బిస్కెట్లను చూసి వ్యాపారులు, ప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్లూ ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచో, స్విట్జర్లాండ్ నుంచో దిగుమతైన బంగారాన్ని అమ్మిన మన చేతులతో.. ఇప్పుడు మన సొంత జిల్లాలో, మన సొంత గడ్డపై పుట్టిన నాణ్యమైన బంగారాన్ని అమ్ముతుండటం గర్వంగా ఉందంటున్నారు స్థానిక వ్యాపారులు! భవిష్యత్తులో ఈ బంగారం ‘మేడిన్ ఆంధ్ర గోల్డ్’గా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందబోతోంది. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన ఈ బంగారం సాదాసీదాగా లేదు. దీని డిజైన్ చూస్తేనే ప్రతి ఆంధ్రుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని 500 గ్రాములు, 100 గ్రాముల బిస్కెట్లుగా మార్కెట్లోకి తెచ్చారు. ఈ గోల్డ్ బార్‌పై ప్రత్యేకంగా ఒక స్లోగన్ ముద్రించారు. అదే.. “ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా.. ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి మైన్స్” అని స్పష్టంగా ముద్రించారు. దీనితో పాటు ఆ బంగారు బిస్కెట్‌పై ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాప్‌ను కూడా స్పష్టంగా ప్రింట్ చేశారు. ఈ గోల్డ్ బిస్కెట్‌ను చూడగానే ఇది ‘మేడిన్ ఆంధ్రా గోల్డ్’ అని ఎవరైనా చెప్పేయగలరు. ఈ స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ నగరాల మార్కెట్లలోకి వెళ్లనున్నాయి. జొన్నగిరి బంగారం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని వ్యాపార దిగ్గజాలు అంచనా వేస్తున్నారు. జియో మైసూర్-జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 24న అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఏపీ పారిశ్రామిక చరిత్రలోనే ఇదొక మైలురాయి. కేవలం పనులను ప్రారంభించడమే కాదు.. బంగారం శుద్ధి కేంద్రానికి ముఖ్యమంత్రి స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాదు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోల్డ్ మైన్ రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేసేశారు! రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ భారీ ప్రాజెక్టును ‘జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దాదాపు 1,495 ఎకరాల విస్తీర్ణంలో, 320 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో జొన్నగిరిలో ఏర్పాటు చేసింది. మొదటి ఏడాదిలోనే ఏకంగా 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా ఈ ఉత్పత్తిని ఏటా 2 టన్నులకు పెంచాలని ఈ సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 700 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఏకంగా 4 శాతం రాయల్టీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దక్కబోతోంది. అంటే ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతటి బూస్ట్ ఇస్తుందో అర్థం చేసుకోండి! ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంలో పూర్తిస్థాయిలో ఏర్పడిన ఏకైక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఈ జొన్నగిరి జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ మాత్రమే! మనం గొప్పగా చెప్పుకునే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గానీ, లేదా ప్రస్తుతం నడుస్తున్న కర్ణాటకలోని హట్టి బంగారు గనులు గానీ.. ఇవన్నీ బ్రిటీషర్ల కాలంలో, అంటే స్వాతంత్య్రానికి పూర్వమే ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో హట్టి గనుల్లో మాత్రమే బంగారం ఉత్పత్తి జరుగుతోంది. అది కూడా ఏటా కేవలం 1.5 టన్నులు మాత్రమే! కానీ మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో మనకు తెలుసు. పెళ్ళిళ్ళు, పండగలు వస్తే టన్నుల కొద్దీ బంగారం కావాలి. దేశ అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల మన దేశ విదేశీ మారక నిల్వలపై విపరీతమైన భారం పడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, దేశీయంగా బంగారం ఉత్పత్తిని పెంచడంలో మన జొన్నగిరి ప్రాజెక్టు దేశానికే దిక్సూచిలా మారబోతోంది. అందుకే, ఈ గ్రామ ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జొన్నగిరి గ్రామాన్ని ఇకపై “స్వర్ణగిరి”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు! ఏపీ ప్రభుత్వం కేవలం జొన్నగిరి ప్రాజెక్టుతోనే ఆగిపోవడం లేదు. రాష్ట్రంలో అన్వేషణను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ‘గోల్డ్ మైనింగ్ హబ్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మరో నాలుగు సరికొత్త గోల్డ్ బ్లాక్‌లను వేలానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ మైనింగ్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టబోతున్నాయి. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల వల్ల కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు.. రాష్ట్రంలో సరికొత్త అనుబంధ రంగాలు వృద్ధి చెందుతాయి. భారీ యంత్రాల నిర్వహణ, రవాణా, హై-లెవెల్ సెక్యూరిటీ, గోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్.. ఇలా వందలాది రంగాల్లో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం బంగారమే కాదు.. ఊహకందని అపార ఖనిజ సంపద దాగి ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఏపీ ఖనిజ సంపదను చూసి ప్రశంసల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురాయి నిల్వల్లో ఏకంగా 92% నిల్వలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి! మైకా, కాల్సైట్, కైనైట్, ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్.. ఇలా పలు కీలక ఖనిజాల్లో దేశంలోనే ఏపీది పైచేయి! ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం భూమిని డ్రిల్లింగ్ చేసేటప్పుడు.. భూగర్భంలో వచ్చే విపరీతమైన ఒత్తిడిని తట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బూడిదరంగు ముగ్గురాయిని వాడతారు. అలాంటి అత్యంత విలువైన ముగ్గురాయి నిల్వలు తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఉన్నాయి. మన దేశానికి చెందిన ఓఎన్జీసీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అంతర్జాతీయ ప్రైవేటు ఆయిల్ కంపెనీలకు ఇక్కడి నుంచే ముగ్గురాయి ఎగుమతి అవుతుంది. ఇది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉంది. ఇక పెయింట్ల తయారీలో వాడే వైట్ బెరైటీస్ వైఎస్సార్ కడప జిల్లాలోని వేముల, వేంపల్లి మండలాల్లో పుష్కలంగా ఉంది. అలాగే పులివెందుల, సింహాద్రిపురం, కలసపాడు, అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో కూడా ఈ నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వైట్ బెరైటీస్‌కు బంగారం లాంటి ధర పలుకుతుంది. దేశం మొత్తం మీద ఉన్న నిల్వల్లో 92% ఏపీలోనే ఉండటం విశేషం! ఈ రోజుల్లో మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో మైకా అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం మైకా నిల్వల్లో 41% మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ మైకా ఖనిజం ఎక్కువగా లభిస్తుంది. పెయింట్ల తయారీ, కాగితం పరిశ్రమ, రసాయనాలు, అలాగే ఫార్మా రంగంలో విరివిగా ఉపయోగించే కాల్సైట్ ఖనిజ నిల్వల్లో దేశంలోనే 40% నిల్వలు ఏపీలోనే ఉన్నాయి. ఇవి ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అలాగే అల్యూమినియం తయారీలో వాడే కైనైట్ నిల్వలు దేశంలో 31% మన నెల్లూరు, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉన్నాయి. ఇక సాధారణంగా గ్రానైట్ అనగానే అందరూ రాజస్థాన్ వైపు చూస్తారు. కానీ భారతదేశంలో ఉన్న మొత్తం గ్రానైట్ నిల్వల్లో ఏకంగా 31% మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయనే నిజం చాలామందికి తెలియదు! ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు మినహా.. ఏపీలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఇందులో అత్యంత హైలైట్ ఏంటో తెలుసా? ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో లభించే “బ్లాక్ గెలాక్సీ” రకం గ్రానైట్! నల్లటి గ్రానైట్ పై నక్షత్రాలు మెరుస్తున్నట్లు ఉండే ఈ అద్భుతమైన గ్రానైట్ ప్రపంచంలో మరెక్కడా దొరకదు! అందుకే దీనికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు శ్రీకాకుళం బ్లూ, ఉత్తరాంధ్రలో దొరికే మూన్‌వైట్, రివర్ వైట్ రకాలు, బల్లికురవలో దొరికే స్టీల్ గ్రే, కనిగిరి బ్లాక్ గ్రానైట్, చిత్తూరు వైట్ గ్రానైట్.. ఇలా ఏపీ గ్రానైట్ ప్రపంచ దేశాల ఇళ్లను అందంగా అలంకరిస్తోంది. ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఒక పెద్ద నిధి. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు విస్తరించి ఉన్న సముద్రతీరంలో విలువైన బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. ఈ ఇసుకలో అత్యంత శక్తివంతమైన, అంతరిక్ష, రక్షణ రంగాల్లో వాడే టైటానియం మినరల్స్ ఉన్నాయి! ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే.. మన దేశంలో ఉన్న మొత్తం టైటానియం ఖనిజాల్లో 19% ఒక్క ఏపీ తీరంలోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే సిలిమినైట్ నిల్వలు 13% ఉన్నాయి. ఇక అల్యూమినియం పరిశ్రమలకు గుండెకాయ లాంటి బాక్సైట్ ఖనిజం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల పరిధిలో దండిగా ఉంది. దేశంలో ఉన్న మొత్తం బాక్సైట్ నిక్షేపాల్లో 16% నిల్వలు ఏపీలోనే ఉన్నాయి. స్టీల్, పెయింటింగ్ పరిశ్రమల్లో, అలాగే ఆక్వా సాగులో వాడే డోలమైట్‌ ఖనిజం దేశంలో 15% ఏపీలోనే ఉంది కర్నూలు, అనంతపురం, కడప, పల్నాడు జిల్లాల్లో డోలమైట్ విరివిగా దొరుకుతుంది. వెర్మిక్యులైట్ ఖనిజం గూడూరు ప్రాంతంలో లభిస్తుంది. దేశంలో ఉన్న మొత్తం ఖనిజంలో 12% నిల్వలు ఏపీ సొంతం. సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన లైమ్‌స్టోన్ నిల్వలు దేశంలో 12% అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో విస్తారంగా ఉన్నాయి. మొత్తానికి ఒకపక్క జొన్నగిరి ప్రెసిడెన్షియల్ గోల్డ్.. ‘మేడిన్ ఆంధ్రా గోల్డ్’ పేరుతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతుంటే.. మరోపక్క ముగ్గురాయి, మైకా, కాల్సైట్, గెలాక్సీ గ్రానైట్, టైటానియం లాంటి అపార ఖనిజ సంపదతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక కొత్త ఇంజిన్‌లా మారబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక విజన్, ఈ మైనింగ్ హబ్ ప్రణాళికలు గనుక వంద శాతం అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్.. సంపదలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబడటం ఖాయం!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్ ఏసీ కోచ్‌ చూసారా? లగ్జరీ ఇంటీరియర్స్‌తో లుక్‌ అదిరిందిగా!

Follow Us