రూ.10 లక్షల లంచం + రోజూ బిర్యానీ = ఏసీబీ షాక్!
కీసర పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పీడీఎస్ బియ్యం కేసులో రూ. 10 లక్షలు డిమాండ్ చేసి, రోజువారీ బిర్యానీలు కూడా అడిగి వేధించిన కేసులో ఐదు లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని అరెస్టు చేశారు. దీంతో స్థానిక ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతికి పాల్పడిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన ఒక కేసులో నిందితుడి నుంచి పది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఈ అధికారులు, చివరికి ఐదు లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ వలకు చిక్కారు. లంచంతో పాటు, ప్రతిరోజూ తమకు బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెచ్చివ్వాలని బాధితుడిని వేధించినట్లు సమాచారం. పోలీసుల వేధింపులు, లంచం ఆగడాలు భరించలేక బాధితుడు సయ్యద్ ఇర్షాద్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి, కీసర చెరువు సమీపంలో లంచం తీసుకుంటుండగా సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ అరెస్టు వార్త తెలియగానే స్థానికులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
