బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా?

Updated on: Nov 06, 2026 | 8:30 PM

అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకాలువ ఉద్ధృతితో నిడదవోలులోని కోట సత్తెమ్మ ఆలయం నీటమునిగింది. పలు గ్రామాలు, కాలనీల్లోకి వరద నీరు చేరగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేటలో భారీ వర్షానికి చెరువులకు గండ్లు పడ్డాయి. దుబ్బాకలో ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఏపీలో కొద్ది రోజుల వ్యవధిలోనే వచ్చిన అర్నబ్, మురసు తుఫాన్లు బీభత్సం సృష్టించాయి.ఈ తుఫాన్ల ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడుతుండగా.. రాబోయే కొద్ది రోజుల పాటు ఈ వానలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణశాఖ ప్రకటించింది. దీపావళి తర్వాత ఈ నెల 11న ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, మునిగిపోయిన కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తణుకు నియోజకవర్గంలోని వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దువ్వ, కోణాల, ముద్దాపురం గ్రామాలతో పాటు అత్తిలి మండలంలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. ఎడతెరిపిలేని వానలతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎర్రకాలువ ప్రవాహం మరింత పెరిగితే వయ్యేరు కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రకాలువకు భారీగా వరద ప్రవాహం పెరగడంతో నిడదవోలు కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం నీటమునిగింది. ఆలయ గర్భాలయం, చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు నాలుగడుగుల మేర వరద నీరు నిలవడంతో పరిసరాలన్నీ చెరువును తలపిస్తున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో భక్తులు దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో ఎర్రకాలువ ప్రవాహం ఉప్పెనలా పెరగడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. సింగవరం, ఆంజనేయపురం ప్రాంతాలతో పాటు నిడదవోలు పట్టణంలోని తీరుగూడెం, సుబ్బరాజుపేట, ఇందిరానగర్ కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేల ఎకరాల వ్యవసాయ పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు ఉండ్రాజవరం మండలం పసలపూడి, సూర్యారావుపాలెం గ్రామాల్లో రైతులు అప్రమత్తమై ఇసుక బస్తాలతో వరద నీటిని అడ్డుకునేందుకు శ్రమిస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గడ్వాల్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీవర్షం కురిసింది. ఐదుగంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వాన కురువడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో ఆ చెరువుల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం అన్నదాతలను రోడ్డున పడేసింది. ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కేంద్రాలకు తీసుకువస్తే, అధికారులు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Sethupathi: ఎమ్మీ అవార్డుల తొలి భారతీయ ప్రెజంటర్‌గా.. హీరో విజయ్ సేతుపతి రికార్డు

అనిరుధ్ సక్సెస్ కారణం ధనుష్‌! ఐశ్వర్య రజినీ కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ! అభిజిత్ ట్వీట్‌తో పెరిగిన అంచనాలు..

Ramayana Part 1: హనుమాన్ ఎంట్రీ.. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్‌ పక్కా..

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో రోహిత్‌కు అవమానం! AV వేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..

Loading...
Unable to load recommendations.
Follow Us