నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు పోడియం లక్ష్మి ఆయుధ పోరాటాన్ని వీడి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన అనంతరం పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తున్న ఆమె ప్రభుత్వం ప్రకటించిన పునరావాస సదుపాయాలు, ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని కోరుతున్నారు. ఆమె జీవితం పునరావాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
నిన్నటివరకు అడవుల్లో తుపాకీ చేతబట్టి విప్లవ బాటలో నడిచిన ఆ చేతులు.. నేడు సమాజంలో గౌరవంగా బతకడానికి నాగలి పట్టాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన పోడియం లక్ష్మి ఎనిమిది ఏళ్ల క్రితం పేదల కోసం పోరాడాలనే ఆశయంతో మావోయిస్టు పార్టీలో చేరారు. భద్రాద్రి, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యురాలిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వివాహమైన రెండేళ్లకే భర్త ‘కర్రె’ గిరిజన గుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించడంతో ఆమె జీవితం మరింత కష్టాల్లో పడింది. మారుతున్న పరిస్థితులతో ఆయుధాల వల్ల సమస్యలు పరిష్కారం కావని గ్రహించిన లక్ష్మి, ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. నాటి సాయుధ పోరాటాన్ని వదిలి.. ఇప్పుడు కుటుంబంలో తన వంతు బాధ్యతగా భుజాన నాగలి మోస్తూ పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు లక్షల రూపాయల రివార్డుతో పాటు, తమకు ఒక ‘ఇందిరమ్మ ఇల్లు’ కేటాయిస్తే కుటుంబంతో కలిసి గౌరవంగా బతుకుతానని ఆమె అధికారులను వేడుకుంటున్నారు. చట్టం ముందు లొంగిపోయి, శ్రమనే నమ్ముకుని బతుకుతున్న లక్ష్మి జీవితం.. తోటి మాజీ మావోయిస్టులకు ఒక మంచి మార్గదర్శిగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్ నెస్ విషయంలో నో కాంప్రమైజ్
