గోల్డ్‌లోన్ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్ చేస్తే బెటర్!
బంగారంపై రుణం తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే అగండాగండి.. ఫిబ్రవరి ఒకటి వరకు ఆగి ఆ తర్వాత ముందుకు వెళ్లండి. ఎందుకంటే బంగారం రుణాలపై కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సంవత్సరం ప్రతి రంగానికి బడ్జెట్‌పై కొన్ని అంచనాలు ఉన్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచాయి. అవి ఆమోదం పొందితే సామాన్యులకు రుణాలు చౌకగా లభించే అవకాశం ఉంది.
బంగారు రుణాలు కోరుకునే చాలా మంది కస్టమర్లు మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారు ఉంటారు. వైద్యం, పిల్లల విద్య, వ్యవసాయం లేదా చిన్న వ్యాపారాల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటూ ఉంటారు. సమస్య ఏమిటంటే బ్యాంకులు అలాంటి వారికి రుణాలు ఇచ్చినప్పుడు, వారు ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే NBFCలు కూడా అదే చేసినప్పుడు, వారికి ఈ ప్రయోజనం లభించదు.NBFCలు మార్కెట్ నుండి అధిక రేట్లకు డబ్బును సేకరించాల్సి ఉంటుంది, చివరికి కస్టమర్‌పై భారం పడుతుంది. బ్యాంకుల మాదిరిగానే తాము కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ హోదా పొందాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. దీనిని బడ్జెట్‌లో ప్రకటిస్తే, NBFCల నిధుల సేకరణ ఖర్చులు తగ్గుతాయి, తద్వారా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకు బంగారు రుణాలను అందించడానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకుంటే, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధిక వడ్డీ రేట్లకు వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకోవలసిన అవసరం ఉండదు.