ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే
విదేశీ మారకద్రవ్య ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వగా, జువెలరీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల ఇళ్లలోనే లక్షల కోట్ల విలువైన బంగారం నిల్వగా ఉందని, దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ సిద్ధం చేస్తోందని సమాచారం. బ్యాంకుల్లో బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించే అవకాశముంది.
విదేశీ మారకం ఆదా చేసుకునేందుకు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని ప్రధాని మోదీ పిలుపునిస్తుంటే మరోవైపు.. జువెల్రీ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఇళ్లలో పోగుబడి ఉన్న బంగారాన్ని పునర్వినియోగంలోకి తీసుకురావాలని అంటే ఆర్థిక వ్యవస్థలోకి తేవాలని చెబుతున్నారు. బంగారం కొనుగోళ్లు నిలిచిపోతే.. 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు కలుగుతుందని అంటున్నారు. బంగారాన్ని భారతీయులు విపరీతంగా కొనుగోలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ.. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారతీయ కుటుంబాల దగ్గర దాదాపు 34,600 టన్నుల మేర బంగారం ఉందని తెలుస్తోంది. దీని విలువ 5 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉంటుందంట. భారత కరెన్సీలో చూస్తే దాదాపు 480 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇది భారత జీడీపీ కంటే కూడా ఎక్కువేనని సమాచారం. భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మన దగ్గర ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతుల విలువ 58 బిలియన్ డాలర్లు ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అది ఏకంగా 24 శాతం పెరిగి 72 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఆల్ టైమ్ హై. ఇలా దిగుమతులు పెరిగితే దీనిని కొనుగోలు చేసేందుకు డాలర్లు వినియోగించాలి కాబట్టి.. విదేశీ మారకం ఖర్చు చేయాలి. దీంతో వాణిజ్య లోటు పెరుగుతుంది. మార్కెట్లో డాలర్ల ప్రవాహం పెరిగి రూపాయి విలువ పతనం అవుతుంది. అందుకే దీనిని అరికట్టేందుకు కేంద్రం తాజాగా బంగారంపై సుంకాల్ని 6 నుంచి 15 శాతానికి పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో సరికొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వెలికి తీసి, దానిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని లాకర్లలో లేదా ఇళ్లలో భద్రపరుచుకుంటారు. ఈ కొత్త విధానంతో, ఆ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ప్రజలు ఆదాయం పొందే వీలుంటుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారంపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా, ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే లాభాలపై పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని, కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా సరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేయనున్నారు. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించేందుకు, ప్రజల నుంచి సేకరించేలా పాలసీని రూపొందించారు. భారతీయుల వద్ద ఉన్న బంగారం బయటకు వస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం దిగుమతులపై మన దేశం ఆధారపడటం తగ్గుతుంది. ఈ స్కీమ్ పాత ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా రాబోతోందని, త్వరలో అధికారిక నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్