Basara: బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత!
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ప్రధాన గర్భాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అమ్మవారిని బాలాలయంలో ప్రతిష్ఠించి భక్తులకు అక్కడే దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. అక్షరాభ్యాసాలు, నిత్యపూజలు యథావిధిగా కొనసాగుతుండగా, తెలంగాణలోనే అత్యంత ఎత్తైన 9 అంతస్తుల గోపుర నిర్మాణం చేపట్టనున్నారు.
చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతిమాత కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రంలో గర్భాలయ దర్శనాలను నిలిపివేశారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, శృంగేరి శారదా పీఠం ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవి అమ్మవార్లతో పాటు ఇతర దేవతామూర్తులకు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష ద్రవ్య అభిషేకం, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి, మంగళవాయిద్యాల నడుమ బాలాలయంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ మహా పుణ్య కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఆలయ నిర్మాణ దాత సురపునేని సునంద్-పద్మప్రియ దంపతులు, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, ఈవో అంజనీదేవి భూమిపూజ చేశారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అక్షరాభ్యాసాలు, నిత్య పూజలు, అభిషేకాలు అన్నీ యథావిధిగా ఇక్కడే కొనసాగుతాయి. ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయానికి నలుదిక్కులా అద్భుతమైన గోపురాలను నిర్మించనున్నారు. తూర్పు, పడమర గోపురాలను 5 అంతస్తులు, దక్షిణ గోపురాన్ని 7 అంతస్తులుగా నిర్మించనుండగా, ఉత్తర గోపురాన్ని ఏకంగా 9 అంతస్తుల ఎత్తుతో నిర్మించనున్నారు. యాదాద్రిలో 7 అంతస్తుల గోపురం ఉండగా, బాసరలో నిర్మించే 9 అంతస్తుల ఉత్తర గోపురం తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రధాన గర్భగుడిని మూసివేయడంతో, గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్క రోజే 951 అక్షరాభ్యాసాలు జరిగాయి. ఇకపై గర్భాలయంలో కేవలం అర్చకులు మాత్రమే ఆగమశాస్త్రం ప్రకారం నిత్యపూజలు నిర్వహిస్తారు. రూపురేఖలు మార్చుకోనున్న చదువుల తల్లి క్షేత్రం, వచ్చే ఏడాది నాటికి మరింత దివ్యంగా భక్తులకు దర్శనమివ్వనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం
