Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న ఐదు రోజులు వాతావరణం భిన్నంగా ఉంటుంది. 'మైలా', 'వలను' తుఫాన్లు, 'ఇందుసా' వాయుగుండం ప్రభావంతో ఏపీ, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాయలసీమ, హైదరాబాద్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉండబోతోంది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల భానుడి ప్రతాపం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ అధికారుల ప్రకారం.. ఆస్ట్రేలియా సమీపంలో ‘మైలా’, ‘వలను’ అనే రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి. తుఫాన్లతో పాటు హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న ‘ఇందుసా’ వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడటంతో ఏప్రిల్ 6 నుండి 10వ తేదీ వరకు ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 6 మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షంతో పాటు పిడుగులుకూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాయలసీమలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతాయని స్పష్టం చేశారు. 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సాయంత్రం వేళ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, 26 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత కొనసాగుతుందని, గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఎండ ప్రభావానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??