
లక్షల్లో జీతం, ఏసీ రూమ్‌లో కూర్చుని చేసే ఉద్యోగం, చేతి నిండా కార్పొరేట్ బెనిఫిట్స్.. ఐటీ రంగంలో పనిచేసే ఎవరి జీవితమైనా బయట నుంచి చూసేవాళ్లకు చాలా లగ్జరీగా కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నవాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ కంప్యూటర్ కుర్చీ ఎంత ఒత్తిడిని ఇస్తుందో.. సరిగ్గా ఇలాంటి అంతులేని పని ఒత్తిడి, కఠినమైన డెడ్‌లైన్స్, నైట్ షిఫ్ట్‌లతో విసిగిపోయిన ఒక ఐటీ ఉద్యోగిని.. ఊహించని నిర్ణయం తీసుకుంది. తన లగ్జరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఏకంగా ఆటో రిక్షా స్టీరింగ్ పట్టింది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె స్టోరీ తెగ వైరల్ అవుతోంది.
భారతదేశపు టెక్నాలజీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. గతంలో ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన సదరు మహిళ.. నిరంతర పని ఒత్తిడి, ఎక్కువ పని గంటల కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంచి ప్యాకేజీ వస్తున్నప్పటికీ, హెల్తీగా లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం రోజురోజుకూ కష్టంగా మారింది. దాంతో మార్పు కోరుకుంటూ, తన జీవితంపై.. తన సమయంపై తనకే పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేట్ ప్రపంచం నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె బెంగళూరు వీధుల్లో ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.
అయితే చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఈ కొత్త వృత్తి ఆమెకు మనశాంతితో పాటు స్థిరమైన ఆదాయాన్ని కూడా అందిస్తోంది. ఆటో రిక్షా నడపడం ద్వారా ఆమె నెలకు సుమారు రూ. 60,000 వరకు సంపాదిస్తోందట. ‘‘పాత ఐటీ ఉద్యోగానికి భిన్నంగా, ఇప్పుడు నా పనివేళలను నేనే డిసైడ్ చేసుకుంటున్నాను. నచ్చినప్పుడు ఆటో తీసుకుని రోడ్డుపైకి వెళ్తాను.. బోర్ కొడితే నా పర్సనల్ లైఫ్‌కి టైమ్ ఇస్తాను. అంతులేని ఆంక్షలు లేవు, గొప్ప స్వేచ్ఛ దొరికింది, అన్నింటికంటే ముఖ్యంగా ప్రశాంతత దొరికింది’’ అని ఆమె సంతోషంగా చెబుతోంది.
ఆమె ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ ఈమె నిర్ణయాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ‘‘అంతులేని మీటింగ్‌లు, అనవసరమైన కాన్ఫరెన్స్ కాల్స్, అర్ధరాత్రి పూట వచ్చే టెక్నికల్ ఎమర్జెన్సీలతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా, భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఇంతటి ధైర్యం చేసిన ఆ మహిళ నిజంగా గ్రేట్” అంటూ 20 ఏళ్లుగా ఐటీ జాబ్ చేస్తున్న ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఐటీ రంగంలో పనిచేసిన ఇన్నాళ్లలో ఆమె ఖచ్చితంగా మంచి పొదుపు చేసి ఉంటుంది.. అందుకే ఆ ధైర్యంతోనే ఇంత సాహసోపేతమైన కెరీర్ నిర్ణయం తీసుకోగలిగిందని అంచనా వేశారు.
డబ్బులు, హోదా, పెద్ద పెద్ద కంపెనీల్లో ట్యాగ్‌లు ఉన్నంత మాత్రాన జీవితంలో సంతోషంగా ఉన్నట్లు కాదు.. ఈ రోజుల్లో వృత్తిపరమైన విజయాన్ని కేవలం జీతాల అంకెలను బట్టే కొలుస్తున్నారు. కానీ వాటన్నింటికంటే మనశాంతి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా విలువైనవని ఈ మహిళ కథ మనకు మరోసారి గుర్తు చేస్తోంది. ఎక్కువ జీతం ఇచ్చే ఒత్తిడి ఉద్యోగం కంటే.. ప్రశాంతతనిచ్చే చిన్న వృత్తి నయమని భావిస్తున్న నేటి తరం సరికొత్త ట్రెండ్‌కు ఈమె ఒక లైవ్ ఎగ్జాంపుల్.