కెరీర్‌కు విరామం కాదు.. ఆ అనుభవం గొప్ప పాఠం నేర్పింది!

మంచి ఉద్యోగం, మంచి జీతం, కెరీర్‌లో ఎదుగుదల.. వీటినే విజయానికి కొలమానాలుగా భావిస్తారు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ విభిన్నంగా ఆలోచించింది. కార్పొరేట్ ఉద్యోగం ఒత్తిడితో విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి నాలుగు నెలలు కుక్కలను సంరక్షించే ఉద్యోగం చేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. కుక్కలతో గడిపిన సమయం జీవితంలో తనకు గొప్ప పాఠం నేర్పిందని ఆమె చెప్పింది. ఇంతకీ ఏంటా పాఠం?

కెరీర్‌కు విరామం కాదు.. ఆ అనుభవం  గొప్ప పాఠం నేర్పింది!
Woman Quit Job To Walk Dogs For 4 Months Calls It Valuable Experience

Updated on: Oct 30, 2026 | 9:27 PM

మంచి ఉద్యోగం, మంచి జీతం, కెరీర్‌లో ఎదుగుదల.. వీటినే విజయానికి కొలమానాలుగా భావిస్తారు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ విభిన్నంగా ఆలోచించింది. కార్పొరేట్ ఉద్యోగం ఒత్తిడితో విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి నాలుగు నెలలు కుక్కలను సంరక్షించే ఉద్యోగం చేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. కుక్కలతో గడిపిన సమయం జీవితంలో తనకు గొప్ప పాఠం నేర్పిందని ఆమె చెప్పింది. ఇంతకీ ఏంటా పాఠం?

సేల్స్‌ ఉద్యోగంలో ఒత్తిడితో విసిగి.. కొత్త దారిలోకి!

కాలిఫోర్నియాకు చెందిన సాలీ సిమన్స్ 2022లో హెల్త్‌కేర్ మార్కెటింగ్‌ ఉద్యోగం చేసేది. అదే సమయంలో ఎంబీఏ చదువుతుండటంతో ఉద్యోగం, చదువు రెండింటినీ సమన్వయం చేయడం కష్టంగా మారింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతంలో నివసిస్తూ, తూర్పు తీర ప్రాంత సమయాలకు అనుగుణంగా పనిచేయాలి. రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే గడిపేది. పని ఒత్తిడి పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. టిక్‌టాక్‌లో ఓ డాగ్ వాకర్‌ను గమనించింది.  అతను కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తూ, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, తనకు నచ్చిన పనులు చేస్తూ కనిపించాడు.

నాలుగు నెలలు కుక్కలతోనే.. మంచి ఆదాయం!

కాలిఫోర్నియాకు మారి బిజినెస్ స్కూల్ లో ఎంబీయే పూర్తి చేసింది. ‘రోవర్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ప్రొఫైల్  పోస్ట్‌ చేసింది. కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం, వాటిని చూసుకోవడం వంటి సేవలకు బుకింగ్స్ వచ్చాయి.  కుక్కలు ఉన్న ఇంటికి వెళ్లి కాసేపు వాటిని చూసుకుంటే 23 డాలర్లు, రాత్రంతా వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే 84 డాలర్లు వసూలు చేసింది.  నాలుగు నెలల్లో 30 మంది కస్టమర్లు ఆమెకు ఫైవ్‌ స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తుండగా జాబ్ ఆఫర్!

ఓ రోజు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లిన  సాలీ జీవితం ఆ సమయంలో ఆసక్తికర మలుపు తీసుకుంది. మార్కెటింగ్ ఉద్యోగం వేకన్సీ ఉంది చేరతారా అంటూ ఆమెకు ఫోన్ కాల్ రావడంతో ఎగిరి గెంతేసి వెళ్లి జాయిన్ అయింది. ఆ సమయంలో ఆమె గర్భవతి కావడంతో స్థిరమైన ఆదాయం ఇచ్చే ఉద్యోగం అవసరమని భావించి తిరిగి మార్కెటింగ్ జాబ్‌లో జాయినైంది.

కెరీర్‌కు విరామం కాదు.. జీవితానికి విలువైన పాఠం!

కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లిన ఆ నాలుగు నెలలు తన కెరీర్‌లో విరామంగా ఇతరులు భావించవచ్చని సాలీ తెలిపింది. కానీ ఆమె దృష్టిలో అది అత్యంత విలువైన వృత్తిపరమైన అనుభవం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడానికి, బాధ్యతగా వ్యవహరించడానికి, నమ్మకంగా పనిచేయడానికి, చేసే పనిని ప్రేమించడానికి కుక్కలతో గడిపిన నాలుగు నెలల అనుభవం తనకు నేర్పిందని అంటుంది.  విజయం అంటే ఉన్నత ఉద్యోగం, అధిక జీతం  కాదని కొన్నిసార్లు మనకు నచ్చిన పని చేయడం ద్వారా మన గురించి మనం మరింత తెలుసుకోవచ్చని, జీవితాన్ని చూసే దృక్పథం కూడా మారవచ్చని ఆమె అంటోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us